GHMC: జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ సివిల్ ఏరియాల విలీనం.. విధివిధానాల ఏర్పాటుకు కేంద్ర కమిటీ

  • ఎస్ సీబీ విలీనానికి ఇప్పటికే ఆమోదం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం
  • స్థిర, చరాస్తుల పంపకం సహా విధానాల రూపకల్పన
  • బల్దియా పరంకానున్న 3 వేల ఎకరాల భూమి
The Central Government has constituted a committee on the merger of Cantonment Civil Areas into GHMC

జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ సివిల్ ఏరియాల విలీనం దిశగా కీలక అడుగుపడింది. దీనికోసం విదివిధానాల రూపకల్పనకు కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో రక్షణ శాఖ, రాష్ట్ర మునిసిపల్ సెక్రటరీ.. మొత్తం 8 మందితో కమిటీ ఏర్పాటు చేసింది. స్థిర, చరాస్తులతో పాటు ఉద్యోగుల బదలాయింపు ఎలా జరగాలి.. తదితర అంశాలపై కమిటీ అధ్యయనం చేయనుంది. దేశంలోనే అతిపెద్ద కంటోన్మెంట్ బోర్డుగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు (ఎస్ సీబీ) పేరొందింది.

అయితే, బేగంపేట విమానాశ్రయం, ఆర్మీ ఆంక్షలు, నిధుల కొరత తదితర కారణాల వల్ల కంటోన్మెంట్ పరిధిలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు. రోడ్ల విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పనపైనా పెద్దగా దృష్టి పెట్టలేదు. ఈ నేపథ్యంలో దేశంలోని కంటోన్మెంట్ బోర్డులను స్థానిక సంస్థల్లో విలీనం చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీనిపై అభిప్రాయాలు తెలియజేయాలంటూ అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు లేఖలు రాసింది.

ఈ నిర్ణయానికి సమ్మతిస్తూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి జవాబిచ్చింది. దీంతో తాజాగా కేంద్ర ప్రభుత్వం విధివిధానాల అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేసింది. జీహెచ్ ఎంసీలో ఎస్ సీబీ విలీనమైతే సుమారు 3 వేల ఎకరాల అత్యంత విలువైన భూమి బల్డియా పరమవుతుంది. ఈ భూముల విలువ రూ.వేల కోట్ల పైనే ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

More Telugu News