Rahul Gandhi: మీడియా నా టీ షర్ట్ మాత్రమే చూసింది.. రైతులు, పేదల చిరిగిన బట్టలను మాత్రం పట్టించుకోలేదు: రాహుల్ గాంధీ

  • భారత్ జోడో యాత్రలో రాహుల్ ధరించిన టీ షర్ట్ పై చర్చ
  • నచ్చినన్ని రోజులు టీ షర్టే వేసుకుంటానన్న కాంగ్రెస్ అగ్రనేత
  • అగ్నిపథ్ పథకంపై విమర్శలు గుప్పించిన రాహుల్ గాంధీ
Media notices my t shirt but does not ask about torn clothes of poor farmers and labourers says Rahul Gandhi

భారత్ జోడో యాత్రలో చలికాలంలో తాను టీ షర్ట్ ధరించడంపై తీవ్ర చర్చలు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. మీడియా తన టీ షర్టును గమనించిందని, అయితే తన వెంట నడిచే పేద రైతులు, కూలీల చిరిగిన బట్టల గురించి మాత్రం అడగలేదని అన్నారు. 

‘నేను (భారత్ జోడో) యాత్రలో టీ-షర్టులు ధరించి నడుస్తున్నా. యాత్రలో చాలా మంది పేద రైతులు, కూలీల పిల్లలు చిరిగిన బట్టలు ధరించి నాతో పాటు నడుస్తున్నారు. చలికాలంలో వాళ్లు స్వెటర్‌, జాకెట్‌ లేకుండా ఎందుకు నడుస్తున్నారని మాత్రం మీడియా అడగదు’ అని రాహుల్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ చలిగాలులతో దెబ్బతిన్న ఢిల్లీలోని కార్యక్రమాలతో సహా చాలా బహిరంగ కార్యక్రమాలకు సాధారణ పోలో టీ-షర్ట్ ధరించి వార్తల్లో నిలిచారు. దీని గురించి ఓ విలేఖరి ప్రశ్నకు స్పందిస్తూ.. తనకు నచ్చినన్ని రోజులు టీ షర్టే ధరిస్తానని చెప్పారు. 

ఇక, రక్షణ దళాలలో స్వల్పకాలిక సేవల కోసం కేంద్రం రూపొందించిన అగ్నిపథ్ పథకం గురించి కూడా రాహుల్ స్పందించారు. ‘ఇంతకుముందు యువకులు 15 సంవత్సరాలు సైన్యంలో పనిచేసి పెన్షన్ పొందేవారు. కానీ, ప్రధాని నరేంద్ర మోదీ పెన్షన్‌ను పక్కన పెట్టడం గురించి ఆలోచించారు. యువతకు ఆరు నెలలు శిక్షణ ఇచ్చి, వారి చేతిలో తుపాకీ పెట్టి, నాలుగేళ్లు పని చేయించుకొని బయటికి తరిమేస్తారు. అప్పుడు వాళ్లు మళ్లీ నిరుద్యోగులు అవుతారు. ఇదీ న్యూ ఇండియా. అంతేకాదు యువత వీధుల్లోకి వచ్చి నిరసనల్లో పాల్గొన్న ఫొటో కనిపిస్తే ఇకపై వారికి ప్రభుత్వ ఉద్యోగం రాదని ప్రధాని మోదీ చెబుతున్నారు. యువత, రైతులు, కూలీలను భయాందోళనకు గురిచేయడమే బీజేపీ విధానం’ అని రాహుల్ ఎద్దేవా చేశారు. కాగా, యూపీలో రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర' గురువారం ఉదయం షామ్లీ నుంచి తిరిగి ప్రారంభమైంది, అక్కడి నుంచి హర్యానాలోకి ప్రవేశిస్తుంది.

More Telugu News