Pathaan Movie: ‘పఠాన్’ను వెంటాడుతున్న కష్టాలు.. అహ్మదాబాద్‌లో మాల్‌ను ధ్వంసం చేసిన బజరంగ్ దళ్

Hindu group vandalises Ahmedabad mall over Pathaan promotion
  • ‘బేషరమ్ రంగ్’ పాట విడుదలైన తర్వాత చుట్టుముట్టిన కష్టాలు
  • ఆ పాటలో కాషాయ రంగు బికినీ ధరించిన దీపిక
  • హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఆందోళన
  • మాల్‌పై దాడిచేసి విధ్వంసం సృష్టించిన కార్యకర్తలు
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్-దీపిక పదుకొణే నటించిన ‘పఠాన్’ సినిమాపై దేశవ్యాప్తంగా ఇంకా ఆగ్రహావేశాలు పెల్లుబుకుతూనే ఉన్నాయి. ఆ సినిమాలోని ‘బేషరమ్ రంగ్’ పాటే ఇందుకు కారణం. దానిని పూర్తి అసభ్యంగా చిత్రీకరించారంటూ తొలి నుంచీ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సినిమాను నిషేధించాలని, కాదని విడుదల చేస్తే అడ్డుకుంటామంటూ ఇప్పటికే పలు హిందుత్వ సంఘాలతోపాటు పలువురు రాజకీయ నేతలు కూడా హెచ్చరించారు. 

తాజాగా, అహ్మదాబాద్‌లో బజరంగ్ దళ్ కార్యకర్తలు ఓ మాల్‌పై దాడి చేసి ధ్వంసం చేశారు. ‘పఠాన్’ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నగరంలోని అల్ఫావాన్ మాల్‌లోకి ప్రవేశించిన బజరంగ్ దళ్ కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు. పఠాన్ సినిమా పోస్టర్లను చింపివేసి కాలితో తొక్కారు. సినిమాను విడుదల చేయొద్దని థియేటర్లను హెచ్చరించారు. 

షారుఖ్ ఖాన్, దీపిక పదుకొణే, జాన్ అబ్రహాం నటించిన పఠాన్ సినిమాలోని ‘బేషరమ్ రంగ్’ పాటను విడుదల చేసిన తర్వాత ఆ సినిమాకు కష్టాలు మొదలయ్యాయి. ఆ పాటలో నటి దీపిక కాషాయ రంగు బికినీ ధరించడమే కాకుండా అసభ్యంగా డ్యాన్స్ చేసినట్టు ఆరోపిస్తూ హిందూ గ్రూపులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సినిమాను నిషేధించాలని, పాటను తొలగించాలని హిందూత్వ కార్యకర్తలు, రాజకీయ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ పాటతో హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ షారుఖ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
Pathaan Movie
Bollywood
Deepika Padukone
Shah Rukh Khan
Besharam Rang
Ahmedabad

More Telugu News