KA Paul: హరిరామజోగయ్యా... ఈ వయసులో నీకెందుకు దీక్షలు?: కేఏ పాల్

KA Paul opines on Harirama Jogaiah hunger strike
  • 2023లో రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చూస్తారన్న పాల్
  • చంద్రబాబు సహా అనేకమందిని సీఎంగా చేశానని వెల్లడి
  • చంద్రబాబు వల్లే రోడ్లపై సభలు నిషేధించారని వ్యాఖ్యలు
  • టీడీపీ కన్నా వైసీపీ వంద రెట్లు నయమన్న పాల్ 
ప్రముఖ శాంతి ప్రబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తాజా రాజకీయ పరిణామాలపై స్పందించారు. సీనియర్ రాజకీయవేత్త, మాజీమంత్రి హరిరామజోగయ్య కాపు రిజర్వేషన్ల కోసం నిరాహార దీక్ష చేయడంపై వ్యాఖ్యానించారు. హరిరామజోగయ్యా... ఈ వయసులో నీకెందుకు ఈ ధర్నాలు, దీక్షలు? మీకు కావాల్సింది ఏమిటి... రిజర్వేషన్లా, రాజ్యాధికారమా? అంటూ కేఏ పాల్ ప్రశ్నించారు. 

నాతో కలిసి రండి... అందరం కలిసి పోరాడుదాం అని పిలుపునిచ్చారు. ఏపీలో 2023లో రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చూస్తారు అని పేర్కొన్నారు. తాను చంద్రబాబుతో సహా అనేకమందిని సీఎంలుగా చేశానని పాల్ తనదైన రీతిలో చెప్పుకొచ్చారు. 

అటు, చంద్రబాబు కారణంగానే ఏపీలో రోడ్లపై సభలు, ర్యాలీలపై ప్రభుత్వం నిషేధం విధించిందని కేఏ పాల్ అన్నారు. చంద్రబాబుకు ఏంచేయాలో పాలుపోవడంలేదని, ఎన్నారైల నల్లడబ్బును తెల్ల డబ్బుగా మార్చేందుకే ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాడంటూ పరోక్షంగా గుంటూరు ఘటనను ఎత్తిచూపారు. చంద్రబాబుతో ఉన్నవాళ్లను తాను శపిస్తున్నానని, చంద్రబాబుతో ఉంటే వాళ్ల జీవితాలు నాశనమైపోతాయని అన్నారు. అసలు టీడీపీ కన్నా వైసీపీ వంద రెట్లు నయమన్నారు.

ఇక, తెలంగాణ సీఎం కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ పార్టీలో ఏపీ నేతలు చేరడంపైనా కేఏ పాల్ తన అభిప్రాయాలు వెల్లడించారు. రావెల కిశోర్ బాబు, తోట చంద్రశేఖర్ అమ్ముడుపోయారని, కేసీఆర్ కు ఏపీలో అడుగుపెట్టే హక్కులేదని స్పష్టం చేశారు.
KA Paul
Harirama Jogaiah
Chandrababu
Andhra Pradesh

More Telugu News