Indian rupee: 2022లో రూపీ 10 శాతం పతనం ఎందుకని?

  • డాలర్ బలోపేతం కావడం ఒక కారణం
  • తరలిపోయిన విదేశీ పెట్టుబడులు
  • అమెరికాలో పెరిగిన వడ్డీ రేట్లు
  • అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు
  • రూపాయి 80 వద్ద స్థిరపడొచ్చన్న అంచనా
Why the Indian rupee fell 10percent against the US dollar in 2022

రూపాయి గతేడాది ఎందుకంతగా పడిపోయింది? దీనిపైనే ఎన్నో పార్టీల నేతలు విమర్శలు కురిపించారు. నిజానికి మన కరెన్సీ విలువ క్షీణత అన్నది మన ఆర్థిక వ్యవస్థ బలహీనత వల్ల కాదని, కేవలం అమెరికా డాలర్ బలోపేతం కావడం వల్లేనని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం పార్లమెంటులో స్పష్టం చేశారు. అలాగే, ఇతర కరెన్సీలతో పోలిస్తే రూపాయి బలపడినట్టు చెప్పారు.

ఆసియా కరెన్సీల్లో డాలర్ తో ఎక్కువగా నష్టపోయింది మన రూపాయే. ఆర్థిక మంత్రి చెప్పినట్టు డాలర్ బలపడడం ఇందుకు ప్రధాన కారణం. దీనికితోడు ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతోంది. రష్యాపై అమెరికా, యూరప్ దేశాలు ఆంక్షలు విధించడం, ఇంధన సరఫరాలు తగ్గడం, కమోడిటీల ధరలు పెరగడం ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో డాలర్ లోకి పెట్టుబడులు పెరిగాయి. పైగా అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను గణనీయంగా పెంచుతూ వస్తోంది. సున్నా నుంచి 4.25 శాతానికి రేట్లు చేరాయి. ఫలితంగా అమెరికా డెట్ మార్కెట్లోకి పెట్టుబడులు కొంత మేర తిరిగి వెళ్లడం సహజం. భారత క్యాపిటల్ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు రూ.1.33 లక్షల కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఒక ఏడాదిలో ఇంత పెద్ద మొత్తం వెనక్కి వెళ్లిపోవడం కూడా రికార్డే.

గతేడాది చైనా యువాన్, ఫిలిప్పీన్ పెసో, ఇండోనేషియా రూపయా 9 శాతం నష్టపోయాయి. దక్షిణ కొరియా వాన్ 7 శాతం, మలేసియా రింగిట్ 6 శాతం చొప్పున క్షీణించాయి. కానీ మన రూపాయి 10 శాతం నష్టంతో ఓ దశలో 83.20కు పడిపోయింది. రూపాయికి ఇది జీవితకాల కనిష్ఠ స్థాయి. అక్కడి నుంచి కొంత కోలుకుంది. రూపాయి విలువను కాపాడేందుకు ఆర్ బీఐ సైతం కొంత ప్రయత్నించింది. అందుకే విదేశీ మారకం నిల్వలు 70 బిలియన్ డాలర్ల మేర తరిగాయి. తిరిగి ఇప్పుడు ఇవి క్రమంగా పెరుగుతున్నాయి. దీనికితోడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కనుక రూపాయి క్షీణత మరింత కాలం కొనసాగదని, డాలర్ తో 80 వద్ద స్థిరపడుతుందన్న అంచనాను నిపుణులు వ్యక్తీకరిస్తున్నారు.

More Telugu News