Tennis Great Martina: గొంతు, రొమ్ము కేన్సర్ బారినపడిన టెన్సిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా

  • తొలి దశలోనే ఉన్న రెండు కేన్సర్లు
  • కేన్సర్లతో పోరాడతానన్న మార్టినా
  • గొంతు పరీక్ష చేయించుకుంటున్న సమయంలో బయటపడిన రొమ్ము కేన్సర్
  • రెండింటికీ సంబంధం లేదన్న వైద్యులు
Tennis icon Martina Navratilova diagnosed with throat and breast cancer

18 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ చాంపియన్‌షిప్ టైటిళ్లను గెలుచుకున్న టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా గొంతు, బ్రెస్ట్ కేన్సర్ బారినపడ్డారు. న్యూయార్క్‌లో ఆమె చికిత్స తీసుకోనున్నారు. కేన్సర్‌తో తాను పోరాడతానని మార్టినా ఈ సందర్భంగా పేర్కొన్నారు. మార్టినా 2010లోనే బ్రెస్ట్ కేన్సర్ బారినపడ్డారు. ఆ తర్వాత ఆమె శస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీ చేయించుకుని బయటపడ్డారు. ఇప్పుడు మరోమారు ఆమెను కేన్సర్లు చుట్టుముట్టాయి. అయితే, ఇవి ప్రారంభ దశలోనే ఉన్నాయని, కోలుకుంటానని 66 ఏళ్ల మార్టినా ఆశాభావం వ్యక్తం చేశారు. చికిత్సకు కేన్సర్ రకం స్పందిస్తున్నట్టు చెప్పారు. రెండు కేన్సర్లు తీవ్రమైనవే అయినా కోరుకున్న ఫలితం వస్తుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. వాటితో తాను పోరాడతానని ధైర్యం ప్రదర్శించారు. 

9 సార్లు వింబుల్డన్ చాంపియన్ అయిన మార్టినా నవ్రతిలోవా ఈ ఏడాది జరగనున్న ఆస్ట్రేలియన్ ఓపెన్‌‌ కోసం ఓ టెన్నిస్ చానల్‌లో కామెంటరీ చెప్పాల్సి ఉంది. అంతలోనే ఆమెకు కేన్సర్లు నిర్ధారణ కావడం అభిమానులను కలవరపరుస్తోంది. గొంతు కేన్సర్ మొదటి దశలోనే ఉందని, ఈ నెల నుంచే ఆమెకు చికిత్స ప్రారంభమవుతుందని వైద్యులు పేర్కొన్నారు. ఆమెకు సోకిన కేన్సర్ హెచ్‌పీవీ రకమని, ఇది చికిత్సకు స్పందిస్తుందని పేర్కొన్నారు.

గత డబ్ల్యూటీఏ ఫైనల్స్ సందర్భంగా మెడ భాగంలో గడ్డను గమనించినట్టు మార్టినా చెప్పారు. దీంతో బయాప్సీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నానని, పరీక్షల్లో కేన్సర్ తొలి దశలో ఉన్నట్టు నిర్ధారణ అయిందన్నారు. మార్టినా గొంతు పరీక్షలు చేయించుకున్న సమయంలో రొమ్ములో అనుమానాస్పద రూపం బయటపడిందని, అది కూడా కేన్సర్ అని నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. అయితే, దీనికి, గొంతు కేన్సర్‌కు సంబంధం లేదని వైద్యులు తెలిపారు. రెండు కేన్సర్లు తొలి దశలోనే ఉన్నాయని, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

నవ్రతిలోవా మూడు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లు, రెండు ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లు, 9 వింబుల్డన్‌లు, 4 యూఎస్ ఓపెన్ టైటిళ్లు గెలుచుకున్నారు. కాబట్టే ఆమె టెన్నిస్‌లో దిగ్గజ క్రీడాకారిణిగా ఖ్యాతిగాంచారు.

More Telugu News