family: కరీంనగర్ జిల్లాలో కుటుంబాన్ని కబళించిన అంతుచిక్కని వ్యాధి

4 members of a family dies with rare disease in gangadhara
  • 45 రోజుల్లోనే ఇద్దరు పిల్లలు, భార్యాభర్తల మృతి
  • విరేచనాలు, వాంతులతో ఆసుపత్రిలో చేరి.. రెండ్రోజుల్లోనే మరణం
  • పిల్లలతో మొదలైన ఉపద్రవం.. రోజుల వ్యవధిలోనే కుటుంబం మొత్తాన్ని తుడిచిపెట్టింది
  • మరణాల వెనక మిస్టరీని తేల్చేందుకు ప్రయత్నిస్తున్న వైద్యులు
ఆటపాటలతో సందడి చేసే పిల్లాడికి ఉన్నట్టుండి విరేచనాలు పట్టుకున్నాయి.. ఆపై వాంతులు కూడా మొదలవడంతో హుటాహుటిన పిల్లాడిని ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స జరుగుతుండగానే పిల్లాడు తుదిశ్వాస వదిలాడు. బిడ్డను పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రుల కన్నీరు ఆరనే లేదు. అంతలోనే బిడ్డకు కూడా విరేచనాలు మొదలయ్యాయి. ఆందోళనతో ఆసుపత్రికి తరలిస్తుండగానే వాంతి చేసుకోవడం మొదలు పెట్టిందా చిన్నారి. ఆసుపత్రిలో చేర్పించి రెండు రోజులు గడిచిన తర్వాత తను కూడా తమ్ముడి దగ్గరికే వెళ్లిపోయింది. 

ఆ తల్లిదండ్రుల కష్టం చూసి ఊరు మొత్తం కన్నీరు పెట్టింది. మరో పది రోజులు గడిచాయి. పిల్లల ఆలోచనలోనే గడుపుతున్న ఆ కుటుంబంలో తల్లికి అనారోగ్యం పట్టుకుంది. అవే లక్షణాలతో ఇబ్బంది పడుతుంటే ఆసుపత్రిలో చేర్పించగా.. రెండు రోజులకు తను కూడా కన్నుమూసింది. ఆ తర్వాత భార్యా పిల్లల వెంటే తను కూడా వెళ్లిపోయాడా భర్త.. కేవలం 45 రోజుల వ్యవధిలో కుటుంబంలో అందరూ కన్నుమూశారు.

అందరిలోనూ అవే లక్షణాలు. విరేచనాలతో మొదలై, వాంతులతో ఇబ్బంది పడుతూ చివరకు ఊపిరి వదిలేయడం. కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండల కేంద్రంలో జరిగిన ఈ మరణాలు మిస్టరీగా మారాయి. గంగాధరకు చెందిన శ్రీకాంత్, ఆయన భార్య మమత, కూతురు అమూల్య, కుమారుడు అద్వైత్.. అంతుచిక్కని వ్యాధితో చనిపోయారు.  45 రోజుల వ్యవధిలో ఆ కుటుంబంలో ఒక్కరూ మిగలలేదు. ఈ కుటుంబంలో జరిగిన విషాదం స్థానికంగా భయాందోళనలను రేకెత్తించింది.

వాళ్ల మరణానికి కారణమేంటని తెలుసుకునేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. మృతదేహాల నుంచి సేకరించిన రక్త నమూనాలను పరీక్షల కోసం హైదరాబాద్ కు పంపించారు. స్థానికుల్లో అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు కలగజేసుకున్నారు. అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదుచేసి దర్యాఫ్తు చేస్తున్నారు.
family
mysterious deaths
health problem
gangadhara
Karimnagar District
family members death

More Telugu News