Adithya Rawal: ఓటీటీ రివ్యూ: 'ఆర్ య పార్' (హాట్ స్టార్ - వెబ్ సిరీస్)

  • డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 'ఆర్ య పార్'
  • ఈ రోజు నుంచే మొదలైన స్ట్రీమింగ్ 
  • అడవి నేపథ్యంలో నడిచే కథ 
  • కన్ఫ్యూజ్ చేసే పాత్రల సంఖ్య
  • పాత్రలు రిజిస్టర్ కావడంలో ఆలస్యం 
  • ఫొటోగ్రఫీ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. యాక్షన్ సీన్స్ హైలైట్

Aar ya Paar OTT Review

ఫారెస్టు నేపథ్యంలోని కథలను తెరపై చూడటానికి ఆనందం .. ఆసక్తికరంగాను ఉంటాయి. అడవి అందాలను తెరపై చూస్తూ కథతో త్వరగా కనెక్ట్ కావడం జరుగుతూ ఉంటుంది. అలాంటి ఫారెస్టు నేపథ్యంలో రూపొందిన మరో వెబ్ సిరీస్ 'ఆర్ య పార్'. జ్యోతి సాగర్ - సిద్ధార్థ్ సేన్ గుప్తా నిర్మించిన ఈ వెబ్ సిరీస్ కి గ్లేన్ బరెట్టో - అంకుశ్ మొహ్ల దర్శకత్వం వహించారు. 8 ఎపిసోడ్స్ కలిగిన ఈ వెబ్ సిరీస్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు ఈ రోజునే స్ట్రీమింగ్ చేశారు.

కథలోకి వెళితే .. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని గిరిజన తెగల్లో ఒక తెగవారు 'జగదల్ గంజ్' ప్రాంతంలోని అడవిలో నివసిస్తూ ఉంటారు. ఈ తెగకి చెందిన గిరిజనులు వెయ్యేళ్లుగా ఆ అడవిని నమ్ముకుని బ్రతుకుతుంటారు. అడవితోను .. అక్కడి జీవులతోను వాళ్లకి అనుబంధం ఉంటుంది. అడవిలో దొరికినదానితో కడుపునింపుకుని ఆనందంతో ఉండే ఆ తెగ ప్రజల జీవితం ఒక్కసారిగా చెల్లాచెదురవుతుంది. అందుకు కారకుడు ప్రముఖ పారిశ్రామిక వేత్త రూబిన్ భట్టా (ఆశిష్ విద్యార్ధి). 

ఆ అడవి ప్రాంతంలో అత్యంత ఖరీదైన ఖనిజ సంపద ఉందని తెలుసుకున్న ఆయన, ఆ ప్రాంతం నుంచి గిరిజనులను తరిమేసి, ఆ ప్రాంతం మొత్తాన్ని ఆక్రమించడానికి ప్రయత్నాలు మొదలుపెడతాడు. ముందుగా ఆయన గిరిజనులు తాగే నది నీటిని విషపూరితం చేస్తాడు. ఆ తరువాత గిరిజనులకు టీకాతో పాటు .. నదిని శుద్ధి చేసే పని మీద డాక్టర్ సంఘమిత్ర (పత్రలేఖ పౌల్) ను పంపిస్తాడు. ఆమె అక్కడికి వెళ్లి తన పని పూర్తిచేస్తుండగానే, రూబిన్ భట్టా మనుషులు విరుచుకు పడతారు. 

ఆ సంఘటనలో చాలామంది గిరిజనులు ప్రాణాలు కోల్పోతారు. దాంతో గిరిజన నాయకుడి కొడుకైన సర్జూ (ఆదిత్య రావెల్) తనవారి ప్రాణాలను తీసినవారిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. అడవిలో ఉన్న తమని వెతుక్కుంటూ వచ్చి చంపిన శత్రువుల కోసం, పట్టణంలో ఉన్న వారిని వెతుక్కుంటూ సర్జూ బయల్దేరతాడు. గూడెం బాధ్యతలను కృష్ణయ్యకి అప్పగించి నగరంలో అడుగుపెడతాడు. 

గిరిజన యువకుడైన సర్జూకి విలువిద్యలో మంచి నైపుణ్యం ఉంటుంది. అలాగే బాల్యం నుంచి ప్రకృతిని అర్థం చేసుకుంటూ పెరిగిన ఆయన ఆయుధాలు లేకుండా కూడా పోరాడగలడు. అయితే నగర నాగరికతతో ఏ మాత్రం పరిచయం లేని సర్జూ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది? తాను తలపెట్టిన కార్యాన్ని ఆయన పూర్తి చేయగలిగాడా? లేదా? అనే ఆసక్తికరమైన మలుపులతో ఈ కథ నడుస్తుంది. 

అడవి తల్లిని నమ్ముకున్న బిడ్డలను అక్కడి నుంచి ఖాళీ చేయించి, అడవిని ఆక్రమించడానికి ప్రయత్నించే కొన్ని స్వార్థ శక్తులకు సంబంధించిన కథలు గతంలో చాలానే వచ్చాయి. అయితే ఈ కథలో ఒక కొత్త పాయింట్ ఉంది. అడవిలోకి వచ్చి తమకి అన్యాయాన్ని తలపెట్టిన శత్రువుల అంతు చూడడానికి దేశాలు దాటేసి వెళ్లే ఒక గిరిజన యువకుడి కథ ఇది. వినడానికి కాస్త అతిశయోక్తిగా అనిపించినప్పటికీ, దర్శకుడు చూపిన మార్గాలు వాస్తవానికి దగ్గరగానే అనిపిస్తాయి. 

మొదటి రెండు ఎపిసోడ్స్ కథ ఊపందుకోవడానికి అవసరమైన వస్తు సామగ్రిని రెడీ చేసుకుంటాయి. మూడో ఎపిసోడ్ నుంచి కథ వేగాన్ని అందుకుంటుంది. గిరిజన యువకుడైన సర్జూ .. తన పేరును సేతులామ్ గా మార్చుకుని, నగరంలో నాలుగు గోడల మధ్య ఉంటూ మానవత్వమనేది లేకుండా తమ జీవితాలను శాసించే మృగాలను వేటాడటం మొదలుపెట్టడంతో కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది.

ఒక వైపున అడవిలోని గిరిజనులు .. మరో వైపున పోలీసులు .. ఇంకో వైపున విలన్ తాలూకు మనుషుల మధ్య హడావిడిగా ఈ కథ నడుస్తూ ఉంటుంది. కథ ఒక చోటు నుంచి మరోచోటికి తరచూ షిఫ్ట్ అవుతూ ఉంటుంది. వివిధ రకాల పాత్రలతో ఆర్టిస్టుల సంఖ్య పెరుగుతూ పోతుంటుంది. కొన్ని  పాత్రలు చాలా సేపటివరకూ రిజిష్టర్ కావు. మరికొన్ని పాత్రల విషయంలో క్లారిటీ ఉండదు. అందువలన సగటు ప్రేక్షకుడు చాలాసేపు గందరగోళంలో ఉండిపోతాడు. 

ఇక నిర్మాణ విలువల పరంగా ఈ వెబ్ సిరీస్ కి వంకబెట్టవలసిన అవసరమే లేదు. అలా ఖర్చు చేసిన ప్రతి పైసా స్క్రీన్ పై కనిపిస్తుంది. వెబ్ సిరీస్ ను కాకుండా ఒక భారీ యాక్షన్ మూవీని తెరపై చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది. ఫారెస్టు నేపథ్యంలోని సన్నివేశాలు .. విదేశాల్లో చిత్రీకరించిన యాక్షన్ దృశ్యాలు కెమెరా పనితీరుకు అద్దం పడతాయి. ఇక ఈ వెబ్ సిరీస్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అని చెప్పక తప్పదు. ఇది కొంచెం క్లిష్టతరమైన స్క్రీన్ ప్లేతో నడుస్తుంది. అయినా పెద్దగా కన్ ఫ్యూజన్ లేని ఎడిటింగ్ వర్క్ కనిపిస్తుంది. 

కథలో కొత్త పాయింట్ ఉంది .. కథనంలో ఆసక్తి ఉంది. చిత్రీకరణ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. యాక్షన్ దృశ్యాలు ప్రధానమైన బలంగా నిలిచాయి. అయితే పాత్రల సంఖ్య ఎక్కువగా ఉండటం వలన .. కథను అనేక బ్యాచ్ ల చుట్టూ తిప్పుతూ ఉండటం వలన ఆడియన్స్ కి రిజిష్టర్ కావడం కష్టమవుతుంది. ఇక డబ్బింగ్ పరంగా పాత్రలకి తగిన వాయిస్ ను .. యాసను సెట్ చేయకపోవడం ప్రధానమైన లోపంగా అనిపిస్తుంది.

More Telugu News