Smriti Irani: జోడో యాత్రలో పాల్గొనాలంటూ స్మృతి ఇరానీకి ఆహ్వానం

  • అమేథీ ఎంపీని ఆహ్వానించిన యూపీ కాంగ్రెస్ నేత దీపక్ సింగ్
  • స్మృతి ఇరానీ కార్యదర్శికి లేఖ అందజేసినట్లు వెల్లడి
  • బీజేపీ నుంచి ఎవరూ యాత్రలో పాల్గొనబోరని తేల్చిచెప్పిన ఆ పార్టీ నేత
Congress Leader Invites Smriti Irani To Join Bharat Jodo Yatra

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొనాలంటూ కేంద్ర మంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీకి ఆహ్వానం అందింది. కాంగ్రెస్ పార్టీ యాత్రకు బీజేపీ నేతకు ఆహ్వానం అందడం ఏమిటని అనుకుంటున్నారా.. ఆహ్వానం అందడం నిజమే. ఉత్తరప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ నేత దీపక్ సింగ్ కేంద్ర మంత్రిని జోడో యాత్రలో పాల్గొనాలంటూ ఆహ్వానించారు. ఈమేరకు గౌరిగంజ్ లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో స్మృతి ఇరానీ కార్యదర్శి నరేశ్ శర్మకు లేఖ అందించారు.

రాహుల్ చేపట్టిన జోడో యాత్రకు నియోజకవర్గంలోని ప్రముఖులను ఆహ్వానించాలంటూ పార్టీ తమను ఆదేశించిందని కాంగ్రెస్ నేత దీపక్ సింగ్ చెప్పారు. ఈ క్రమంలోనే అమేథీ ఎంపీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని యాత్రకు ఆహ్వానించినట్లు ఆయన వివరించారు. ఈ ఆహ్వానంపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు స్పందిస్తూ.. బీజేపీ నుంచి ఎవరూ యాత్రలో పాల్గొనే సమస్యే లేదని తేల్చిచెప్పారు. కాగా, ఉత్తరప్రదేశ్ లోని అమేథీ నుంచి స్మృతి ఇరానీ ఎంపీగా గెలిచారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన రాహుల్ గాంధీని ఆమె ఓడించారు.

More Telugu News