Chiranjeevi: నాకు పెద్దరికం వద్దు: చిరంజీవి

I dont want leadership says Chiranjeevi
  • సి.కల్యాణ్, భరద్వాజ్ వంటి వాళ్లు తనను పెద్దోడు అంటున్నారన్న చిరంజీవి
  • తన కంటే చిన్నవాళ్లు అనిపించుకోవాలని అలా అంటున్నారని చమత్కారం
  • సినీ కార్మికులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని వ్యాఖ్య
సినీ పరిశ్రమలో పెద్దరికం అనుభవించాలనే కోరిక తనకు లేదని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. సి.కల్యాణ్, భరద్వాజ్ వంటి వాళ్లు తనను సినీ పరిశ్రమకు పెద్దోడు అంటున్నారని... వాళ్లు తనకంటే చిన్నవాళ్లు అని అనిపించుకునేందుకు ఇలా అంటున్నారని చమత్కరించారు. తనకు పెద్దరికం వద్దని... అయితే, సినీ కార్మికులకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని చెప్పారు. భగవంతుడు తాను కోరుకున్న దానికంటే ఎక్కువే ఇచ్చాడని అన్నారు. హైదరాబాద్ చిత్రపురి కాలనీలో నూతన గృహ సముదాయాన్ని చిరంజీవి ప్రారంభించారు. లబ్ధిదారులకు ఇంటి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఈ కాలనీ నిర్మాణానికి 22 ఏళ్ల క్రితం శంకుస్థాపన జరిగిందని చిరంజీవి తెలిపారు. తాను కొంచెం బిజీగా ఉన్నప్పటికీ... ఈరోజుకు ఉన్న ప్రాముఖ్యత గురించి మన వాళ్లు చెప్పడంతో... తాను కచ్చితంగా ఇక్కడ ఉండాలని వచ్చానని చెప్పారు. కొన్నేళ్ల క్రితం సింగిల్ బెడ్రూమ్ ఇళ్లను అప్పగించే సందర్భంగా కూడా తాను వచ్చానని తెలిపారు. ప్రభాకర్ రెడ్డి వంటి వారి దూరదృష్టి వల్లే సినీ కార్మికుల సొంతింటి కల సాకారం అయిందని చెప్పారు. చిత్రపురి కాలనీ ఇళ్ల నిర్మాణంలో గతంలో జరిగిన అక్రమాల గురించి తనకు తెలియదని అన్నారు. ఈ అంశంపై తాను మాట్లాడనని చెప్పారు.
Chiranjeevi
Tollywood

More Telugu News