Uzbekistan: మొన్న గాంబియా, ఇప్పుడు ఉజ్బెకిస్థాన్.. భారత్ తయారీ సిరప్ తాగి 18 మంది చిన్నారుల మృతి!

  • ‘డాక్-1 మ్యాక్స్’ సిరప్‌ తాగి సమర్‌కండ్‌లో చిన్నారుల మృతి
  • సిరప్‌లో కలుషిత ఇథిలీన్ గ్లైకాల్ ఉన్నట్టు గుర్తింపు
  • అధికమోతాదులో ఇవ్వడమే మరణాలకు కారణమంటున్న ప్రాథమిక అధ్యయనం
  • సిరప్‌లో పారాసెటమాల్ ఉండడంతో జలుబు మందుగా పొరబడి ఉంటారన్న ఉజ్బెక్ ప్రభుత్వం
an Indian syrup linked to deaths of 18 kids in Uzbekistan

భారత తయారీ సిరప్‌ను తాగి గాంబియాలో 70 మంది చిన్నారులు మృతి చెందిన ఘటన మరువకముందే అలాంటి ఘటనే ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌కండ్‌లో జరిగింది. నోయిడాలోని మారియన్ బయోటెక్ తయారు చేసిన ‘డాక్-1 మ్యాక్స్’ సిరప్‌ను తాగి 18 మంది చిన్నారులు మరణించినట్టు  ఉజ్బెకిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరోపించింది. సిరప్‌ను ప్రిస్క్రిప్షన్ ప్రిస్క్రిప్షన్ లేకుండా బాధిత చిన్నారులకు ఎక్కువ మోతాదులో ఇవ్వడం వల్ల ఈ మరణాలు సంభవించినట్టు తేలిందని పేర్కొంది. సిరప్‌లో కలుషిత ఇథిలీన్ గ్లైకాల్‌ ఉన్నట్టు లేబరేటరీ పరీక్షల్లో వెల్లడైందని పేర్కొంది. 

సిరప్‌లోని కొన్ని నిర్దిష్ట బ్యాచ్‌లో ఇథిలీన్ గ్లైకాల్‌ ఉనికి బయటపడినట్టు లేబరేటరీ ప్రాథమిక పరీక్షల్లో వెల్లడైంది. సిరప్ విషపూరితమైందని, దానిని అధికమోతాదులో తీసుకోవడం వల్ల వాంతులు, స్పృహ కోల్పోవడం, హృదయ సంబంధ సమస్యలు, మూత్రపిండాల వైఫల్యం ఏర్పడొచ్చని లేబరేటరీ అధ్యయనం పేర్కొంది. గాంబియాలో ఈ ఏడాది 70 మంది చిన్నారుల మృతికి కారణమైన నాలుగు సిరప్‌లలో కలుషిత ఇథిలీన్ గ్లైకాల్, డై ఇథిలీన్ గ్లైకాల్‌ను కనుగొన్నారు. చిన్నారుల మరణాలపై విచారణ జరుగుతున్నట్టు ఉజ్బెకిస్థాన్ పేర్కొంది. కాగా, ఈ మరణాలపై సిరప్‌ను తయారుచేసిన మారియన్ బయోటెక్ కానీ, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. 

డాక్-1 మ్యాక్స్‌లో పారాసెటమాల్ కూడా ఒకటిగా ఉండడంతో స్థానిక ఫార్మసీల సిఫార్సులపై చిన్నారుల తల్లిదండ్రులు దీనిని జలుబు మందుగా తప్పుగా అర్థం చేసుకుని ఉపయోగించినట్టు ఉజ్బెకిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరణాలకు అదే కారణమై ఉంటుందని పేర్కొంది. బాధిత చిన్నారులు ఆసుపత్రిలో చేరడానికి ముందు రెండు నుంచి 7 రోజులపాటు రోజుకు మూడు నాలుగుసార్లు 2.5 నుంచి 5 ఎంఎల్ డోసు వేసుకున్నట్టు అధికారులు తెలిపారు. సాధారణంగా తీసుకోవాల్సిన డోసుకు ఇది మించిపోయిందన్నారు. 

ఏడాది లోపు చిన్నారులకు 100 నుంచి 125 మిల్లీ గ్రాములు, ఒకటి నుంచి మూడేళ్లలోపు పిల్లలకు 200 మిల్లీగ్రాములు, 3 నుంచి 5 ఏళ్లలోపు చిన్నారులకు 250 మిల్లీ గ్రాములు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాదు, దీనిని 38 నుంచి 38.5 డిగ్రీల శరీర ఉష్ణోగ్రత వద్దే తీసుకోవాలని, సాధారణ శరీర ఉష్ణోగ్రత వద్ద తీసుకోకూడదని వివరించారు.

More Telugu News