Pakistan: హిజ్రాలను కాల్చి చంపిన కేసు.. పాకిస్థాన్ మాజీ మంత్రి కుమారుడికి మరణశిక్ష!

  • 2008లో తన ఔట్‌హౌస్ వద్ద డ్యాన్స్ పార్టీ ఏర్పాటు చేసిన మాజీ మంత్రి తనయుడు అహ్మద్ బిలాల్
  • తాము చెప్పినట్టు చేయలేదంటూ హిజ్రాలను తుపాకితో కాల్చి చంపిన వైనం
  • అమెరికా పారిపోయి ఈ ఏడాది జులైలో తిరిగి దేశంలో అడుగుపెట్టిన బిలాల్
  • ఎయిర్‌పోర్టు వద్దే అదుపులోకి తీసుకున్న పోలీసులు
Ex ministers son sentenced to death for killing three transgender persons in Pakistan

ముగ్గురు హిజ్రాలను కాల్చి చంపిన కేసులో పాకిస్థాన్ మాజీ మంత్రి కుమారుడికి కోర్టు మరణశిక్ష విధించింది. అలాగే, బాధిత కుటుంబాలకు పరిహారంగా రూ. 5 లక్షల చొప్పున అందించాలని ఆదేశించింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. పంజాబ్ మాజీ మంత్రి అజ్మల్ చీమా కుమారుడు అహ్మద్ బిలాల్ చీమా 2008లో సియోల్‌కోట్‌లోని తన ఔట్ హౌస్ వద్ద డ్యాన్స్ పార్టీ ఏర్పాటు చేశాడు.

ఈ పార్టీకి మజ్‌హర్ హుస్సేన్, ఆమిర్ షాజద్, అబ్దుల్ జబ్బార్ అనే ముగ్గురు హిజ్రాలను పిలిచాడు. అయితే, వారు తాను, తన స్నేహితులు చెప్పినట్టుగా చేసేందుకు నిరాకరించడంతో అహ్మద్ బిలాల్ ఆగ్రహంతో ఊగిపోయాడు. వెంటనే తుపాకితో వారిపై కాల్పులు జరిపాడు. దీంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 

ఈ ఘటన తర్వాత బిలాల్ అమెరికా పరారయ్యాడు. ఈ ఏడాది జులైలో తిరిగి పాకిస్థాన్‌లో అడుగుపెట్టిన బిలాల్‌ను పోలీసులు విమానాశ్రయం వద్దే అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసును విచారించిన న్యాయస్థానం బిలాల్‌కు మరణశిక్ష విధించింది. బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందించాలని కోర్టు ఆదేశించింది.

More Telugu News