USA: ప్రాణం తీసిన సరదా.. అమెరికాలో గడ్డకట్టిన సరస్సులో నడిచి ముగ్గురు భారతీయుల మృతి

3 Indian Americans Walking On Frozen Lake Fall Through Ice Drown
  • అరిజానా రాష్ట్రంలోని క్యానన్ సరస్సు వద్ద ఘటన
  • నీటిలో మునిగిన మహిళను వెంటనే బయటకు తీసినా ప్రాణాలు దక్కని వైనం
  • ప్రస్తుతం ఉత్తర అమెరికాలో తీవ్ర తుపాను
మంచుతో గడ్డ కట్టిన సరస్సుపై నడవాలన్న సరదా విషాదంగా మారింది. అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో గడ్డ కట్టిన సరస్సుపై నడుచుకుంటూ మంచులో పడి ఓ మహిళ సహా ముగ్గురు భారతీయులు చనిపోయారు. ఈ నెల 26న మధ్యాహ్నం అరిజోనాలోని కోకోనినో కౌంటీలోని వుడ్స్ కాన్యన్ సరస్సు వద్ద ఈ సంఘటన జరిగింది. మంచులో కూరుకుపోయిన ముగ్గురిని సహాయ సిబ్బంది వెలికితీసినా వాళ్ల ప్రాణాలను కాపాడలేకపోయారు. మృతులను నారాయణ ముద్దన (49), గోకుల్ మెడిసేటి (47), హరిత ముద్దనగా గుర్తించారు. 

ముగ్గురు బాధితులూ అరిజోనాలోని చాండ్లర్‌లో నివసిస్తున్నారు. చాండ్లర్ ఫీనిక్స్ శివారు ప్రాంతం. హరితను వెంటనే నీటి నుంచి బయటకు తీయగలిగామని, ప్రాణాలను రక్షించే చర్యలు చేపట్టినా సఫలం కాకపోవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందిందని అధికారులు తెలిపారు. ఆ తర్వాత నారాయణ, గోకుల్ మృతదేహాలను వెలికితీశారు. ప్రస్తుతం ఉత్తర అమెరికాలోని చాలా ప్రాంతాలు మంచు తుపానుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. దీనివల్ల ఇప్పటికే 60 మందికిపైగా మృతి చెందారు. వేలాది విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇళ్లు, వాహనాలు దెబ్బతిన్నాయి.
USA
america
indians
ice lake
dead

More Telugu News