Vodafone idea: అలర్ట్... 'వొడాఫోన్ 5జీ సేవలు' అంటూ మోసగాళ్ల ఎస్ఎంఎస్ లు!

  • టెలికం యూజర్లను మోసగించేందుకు సైబర్ నేరగాళ్ల పన్నాగం
  • వొడాఫోన్, జియో, ఎయిర్ టెల్ యూజర్లకు ఇలాంటి సందేశాలు
  • సందేశంతో పాటు వచ్చే లింక్ పై క్లిక్ చేయొద్దన్నది సూచన
Vodafone idea users getting 5G live in your area message is a scam

ఇటీవలి కాలంలో వొడాఫోన్ ఐడియా యూజర్లకు 5జీ సేవల పేరుతో మోసపూరిత ఎస్ఎంఎస్ లు వస్తున్నాయి. ఇవి కంపెనీ నుంచి వచ్చాయనుకుంటే మోసపోవడానికి ఆస్కారం ఉంది. ఇప్పటి వరకు మన దేశంలో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్ కంపెనీలే 5జీ సేవలను అందిస్తున్నాయి. వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ నుంచి ఈ సేవలు ఇంకా మొదలు కాలేదు. జియో, ఎయిర్ టెల్ కూడా కొన్ని పట్టణాల్లోనే 5జీ సేవలను ఆఫర్ చేస్తున్నాయి. ఆయా పట్టణాల్లోని యూజర్లకు 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయంటూ జియో, ఎయిర్ టెల్ సంక్షిప్త సందేశాలు పంపిస్తున్నాయి.

అచ్చం ఇదే మాదిరి ఎస్ఎంఎస్ లు వొడాఫోన్ ఐడియా యూజర్లకు కూడా వస్తున్నాయి. వాట్సాప్ కు సైతం ఈ సందేశాలు వస్తున్నాయి. ఓ లింక్ పంపించి, దానిపై క్లిక్ చేయడం ద్వారా 5జీ సేవలను పొందొచ్చనే సమాచారం ఉంటోంది. ఆ లింక్ పై క్లిక్ చేస్తే ఫోన్ లోకి మాల్వేర్ ను జొప్పించి సున్నితమైన సమాచారాన్ని నేరగాళ్లు తస్కరిస్తారు. బ్యాంకు ఖాతా తదితర వివరాలు వారికి చేతికి వెళ్లాయంటే ఉన్నదంతా వేగంగా ఊడ్చేసే ప్రమాదం లేకపోలేదు. 

ఆశ్చర్యకర విషయం ఏమిటంటే, ఎయిర్ టెల్, జియో యూజర్లకు సైతం ఇలాంటి సందేశాలను పంపిస్తున్నారు. ఇప్పటి వరకు 5జీ సేవలు ఇంకా చేరని పట్టణాల్లోని వారిని సందేశాలతో మోసగించేందుకు సైబర్ నేరస్థులు ప్రయత్నిస్తున్నారు. కనుక వొడాఫోన్ ఐడియా యూజర్లు కానీ, మరే ఇతర నెట్ వర్క్ యూజర్లు అయినా సరే ఫోన్ కు వచ్చే సందేశాలకు స్పందించకుండా ఉండడమే మేలు. అది అధికారికంగా కంపెనీ పంపించిన సందేశమే అయినా పట్టించుకోవద్దు. ఫోన్ సెట్టింగ్స్ లోని నెట్ వర్క్ ఆప్షన్ లో ప్రిఫర్డ్ నెట్ వర్క్ టైప్ వద్ద 3జీ, 4జీ, 5జీ ఆప్షన్లు కనిపిస్తాయి. 5జీ సెలక్ట్ చేసుకుంటే కంపెనీ సేవలు అందుబాటులో ఉన్నదీ, లేనిదీ తెలుస్తుంది.

More Telugu News