Stalin: రాహుల్ గాంధీ ప్రసంగాలు దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి: తమిళనాడు సీఎం స్టాలిన్

Rahul Gandhi speeches creating tremors in our country says Stalin
  • యాత్రలో రాహుల్ సిద్ధాంతపరమైన రాజకీయాల గురించే మాట్లాడుతున్నారన్న స్టాలిన్ 
  • కొన్నిసార్లు నెహ్రూ మాదిరి ప్రసంగిస్తున్నారని కితాబు
  • నెహ్రూ నిజమైన ప్రజాస్వామ్యవాది అని వ్యాఖ్య
భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న ప్రసంగాలు మన దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయని తమిళనాడు సీఎం స్టాలిన్ అన్నారు. మన దేశంలో సెక్యులరిజం విలువలను బతికించుకోవడానికి, ప్రజల మధ్య సమానత్వాన్ని సాధించడానికి మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ వంటి నాయకులు అవసరమని చెప్పారు. నెహ్రూ ఒక నిజమైన ప్రజాస్వామ్యవాది అని, అందుకే ప్రజాస్వామ్యవాదులందరూ ఆయనను ప్రశంసిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ సంస్థలు మూతపడుతున్న తరుణంలో మనం నెహ్రూను గుర్తుకు తెచ్చుకుంటున్నామని తెలిపారు. 

సోదరుడు రాహుల్ గాంధీ యాత్ర అద్భుతంగా సాగుతోందని స్టాలిన్ చెప్పారు. తన యాత్రలో రాహుల్ ఎన్నికల రాజకీయాల గురించి కానీ, పార్టీ రాజకీయాల గురించి కానీ మాట్లాడటం లేదని... కేవలం సిద్ధాంతపరమైన రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడుతున్నారని కితాబునిచ్చారు. అందువల్లే రాహుల్ ను కొందరు పనికట్టుకుని గట్టిగా విమర్శిస్తున్నారని అన్నారు. 

కొన్ని సార్లు నెహ్రూ మాదిరి రాహుల్ మాట్లాడుతున్నారని అన్నారు. తమిళనాడుకు నెహ్రూ ఎంతో చేశారని... రాష్ట్రంలో బలవంతంగా హిందీని రుద్దే ప్రయత్నం చేయలేదని చెప్పారు. ప్రస్తుతం అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. తమిళనాడులో ఐఐటీ మద్రాస్, ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ వంటివి నెహ్రూ వల్లే వచ్చాయని చెప్పారు. నెహ్రూను గాంధీ కూడా ప్రశంసించేవారని... నెహ్రూ నాయకత్వంలో దేశం సురక్షితంగా ఉంటుందని అన్నారని చెప్పారు.
Stalin
Tamil Nadu
Rahul Gandhi
Congress

More Telugu News