kaikala: ఎన్టీఆర్‌కు తాతగా నటించి మెప్పించిన కైకాల

  • 'మనుషులంతా ఒక్కటే' సినిమాలో పాత్ర కోసం కైకాలను అడిగిన దాసరి
  • ఆ పాత్రకు న్యాయం చేయలేననే భయంతో వద్దన్న కైకాల
  • ఎన్టీఆర్ తో చెప్పించి, దాసరి తనను ఒప్పించారని ఓ ఇంటర్వ్యూలో వెల్లడి
kaikala with sr ntr in manushulantha okkate movie

తెరపైన యముడి పాత్రకు ప్రత్యామ్నాయంగా కనిపించిన కైకాల సత్యనారాయణ సీనియర్ ఎన్టీఆర్ కు తాతగా నటించి మెప్పించారు. ఎన్టీఆర్ తో దాసరి నారాయణరావు తొలి సినిమా ‘మనుషులంతా ఒక్కటే’. ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమాలో ఆయనకు తండ్రిగా, తాతగా కైకాల నటించారు. అయితే, తొలుత ఈ పాత్ర కోసం దాసరి తనను అడిగితే కాదన్నట్లు కైకాల స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఎన్టీఆర్ కు తాతగా నటించి ప్రేక్షకులను మెప్పించగలనా అనే సందేహంతో వద్దన్నట్లు చెప్పారు.

అయితే, పట్టువిడవని దాసరి నారాయణరావు ఈ విషయాన్ని ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్లారట. దీంతో కైకాలను పిలిపించిన ఎన్టీఆర్.. ఆ వేషం నువ్వు వేస్తావా? లేక కథ మార్చమంటావా? అని అడిగారట. ఎన్టీఆర్ కంఠంలోని సీరియస్‌ నెస్‌ని గమనించి కంగారుపడి ఒప్పుకున్నానని కైకాల చెప్పారు. గతంలో తనను ప్రోత్సహించి, ఎదుగుదలకు మార్గం చూపిన వ్యక్తి అడగడంతో మారుమాట్లాడలేదని ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ పాత్రను ఛాలెంజ్ గా తీసుకుని నటించానని, అందులో 'తాతా బాగున్నావా?' అనే పాట అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచిందని చెప్పారాయన.

More Telugu News