Reliance: అంబానీ సొంతమైన ‘మెట్రో క్యాష్ అండ్ క్యారీ’

  • ‘మెట్రో’లోని వందశాతం వాటాను రూ. 2,850 కోట్లకు కొనుగోలు చేసిన రిలయన్స్ 
  • వచ్చే ఏడాది మార్చి నాటికి కొనుగోలు ప్రక్రియ పూర్తి
  • పూర్తిగా నగదు రూపంలో జరగనున్న లావాదేవీల ప్రక్రియ
Reliance Retail acquires Metro Cash and Carry

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ గూటికి మరో కంపెనీ వచ్చి చేరింది. మల్టీ చానల్ బిజినెస్ టు బిజినెస్ (బీ2బీ) కంపెనీ మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ను ఆయనకు చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) కొనుగోలు చేసింది. అందులోని 100 శాతం వాటాను రూ.2,850 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఆర్ఐఎల్ అనుబంధ విభాగం రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్ఆర్‌వీఎల్) ఒప్పందం కుదుర్చుకుంది. పూర్తిగా నగదు రూపంలో జరగనున్న ఈ లావాదేవీ వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. 

ఆర్ఆర్‌వీఎల్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 16,600కు పైగా చిల్లర విక్రయ కేంద్రాలు నిర్వహిస్తోంది. భారత వర్తక, కిరాణా వ్యవస్థపై తమకున్న అవగాహనకు మెట్రో ఇండియా ఆస్తులను జతచేయడం ద్వారా దేశంలోని చిన్న వ్యాపారాలకు మరింత విలువైన సేవలు అందించేందుకు వీలవుతుందని భావిస్తున్నట్టు ఈ సందర్భంగా ఆర్ఆర్‌వీఎల్ డైరెక్టర్ ఈశా అంబానీ తెలిపారు. కాగా, రిలయన్స్ ఇప్పటికే జస్ట్ డయల్, డంజో‌లను కొనుగోలు చేసింది. అలాగే, ఐటీసీ, టాటా, అదానీ, పతంజలికి పోటీగా ఇండిపెండెన్స్ పేరుతో ఇటీవల సొంత ఎఫ్ఎంసీజీ బ్రాండ్ ఉత్పత్తులను ఆవిష్కరించింది. 

More Telugu News