Varala Anand: ఏపీ, తెలంగాణ రచయితలు మధురాంతకం నరేంద్ర, వారాల ఆనంద్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు!

  • మధురాంతకం నరేంద్ర ‘మనోధర్మపరాగం’ నవలకు సాహిత్య అకాడమీ పురస్కారం
  • ‘ఆకుపచ్చని కవితలు’కు గాను వారాల ఆనంద్‌కు పురస్కారం
  • మొత్తం 23 భాషల్లోని మూల రచనలకు పురస్కారాలు
Kendra Sahitya Academi Awards for Telugu poets

ఏపీకి చెందిన ప్రముఖ నవలా రచయిత, కథకుడు మధురాంతకం నరేంద్రకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. తెలుగులో దేవదాసీ వ్యవస్థపై చారిత్రక పాత్రల జీవితాలను ఆధారంగా తీసుకుని రచించిన ‘మనోధర్మపరాగం’ నవలకు సాహిత్య అకాడమీ పురస్కారాన్ని ప్రకటించినట్టు కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కృత్తివెంటి శ్రీనివాసరావు తెలిపారు. 

అలాగే, తెలంగాణకు చెందిన ప్రముఖ రచయిత వారాల ఆనంద్‌కు సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది. ఈ ఏడాది ఏడు కవితా సంకలనాలు, ఆరు నవలలు, రెండు కథా సంపుటాలు, 3 నాటకాలు, రెండు సాహిత్య విమర్శ గ్రంథాలతోపాటు మొత్తం 23 భాషల్లో మూల రచనలకు పురస్కారాలు ఇవ్వాలని నిర్ణయించినట్టు శ్రీనివాసరావు తెలిపారు.

అలాగే, ప్రముఖ హిందీ కవి బద్రీనారాయణ్, తమిళ నవలా రచయిత రాజేంద్రన్, సింధీ సాహిత్య చరిత్రకారుడు కన్నయ్యలాల్ లేఖ్వానీ తదితరులకు పురస్కారాలు ప్రకటించారు. అవార్డులో భాగంగా ప్రతీ మూల రచయితకు లక్ష రూపాయల నగదు, తామ్రపత్రాన్ని పురస్కరిస్తారు. 

కాగా, మధురాంతకం నరేంద్ర ఏపీలోని చిత్తూరు జిల్లా దామలచెరువులో 1957లో జన్మించారు. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి రచయితగా గుర్తింపు పొందారు. కథలు, కథానికలు రచించారు. కాగా, హిందీ కవి గుల్జార్ రచించిన గ్రీన్ పోయమ్స్‌ను ‘ఆకుపచ్చని కవితలు’ పేరిట తెలుగులో అనువదించినందుకు గాను వారాల ఆనంద్‌కు పురస్కారం లభించింది. అనువాద పురస్కారాలకు రూ. 50 వేల నగదు, తామ్ర పత్రాన్ని బహూకరిస్తారు. కరీంనగర్ జిల్లాకు చెందిన వారాల ఆనంద్‌ కవిగా, రచయితగా, సినిమా రంగ విశ్లేషకుడిగా పేరు పొందారు.

More Telugu News