china singer: కోరి కరోనాను అంటించుకున్న చైనా గాయని.. ఎందుకంటే!

  • ఒక్క రోజులోనే కోలుకున్నానంటూ సోషల్ మీడియాలో పోస్టు
  • వైరస్ తో దేశం అల్లాడుతుంటే ఇదేం మూర్ఖపు పనంటూ మండిపడ్డ నెటిజన్లు
  • విమర్శలు వెల్లువెత్తడంతో పోస్టును డిలీట్ చేసిన గాయని
  • కరోనా సోకడం తప్పనపుడు ఖాళీగా ఉన్నపుడు సోకితే మేలనేదే తన ఉద్దేశమని వివరణ
Chinese Singer Jane Zhang Intentionally Infected Herself With COVID19

కరోనా సోకుతుందేమోననే భయంతో జనం జాగ్రత్తలు తీసుకుంటుంటే చైనా గాయని ఒకామె తనకు తానే వైరస్ ను అంటించుకుంది. కరోనా బాధితులను కలిసి తాను కూడా కరోనా బాధితురాలిగా మారింది. ఈ నెలాఖరులో పాల్గొనాల్సిన ఓ పోగ్రాం కోసమే ఇలా చేశానంటూ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. జనమంతా విమర్శించడంతో తన పోస్టును డిలీట్ చేసి ప్రజలకు సారీ చెప్పిందా గాయని.. చైనాలో ప్రముఖ గాయనిగా పేరొందిన జేన్ ఝాంగ్ చేసిన నిర్వాకమిది.

కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా ఈ నెలాఖరున జేన్ ఝాంగ్ ఓ కార్యక్రమంలో పాటలు పాడాల్సి ఉంది. అయితే, దేశంలో వైరస్ కేసులు భారీగా పెరుగుతుండడంతో జేన్ లో ఆందోళన మొదలైంది. తనకు వైరస్ సోకితే పాటల పోగ్రాంలో పాల్గొనడం కుదరదని భయపడింది. దీనికి పరిష్కారంగా ఇప్పుడే వైరస్ సోకితే నెలాఖరు వరకు కోలుకోవచ్చు కదా అని ఆలోచించింది. అనుకున్నదే తడవుగా వైరస్ బాధితులను కలిసి కరోనాను అంటించుకుంది.

జలుబు, ఒళ్లునొప్పులు, గొంతులో ఇబ్బంది తదితర లక్షణాలు కనిపించగానే హాయిగా పడకేసినట్లు జేన్ చెప్పింది. నీళ్లు బాగా తాగుతూ, విటమిన్ ట్యాబెట్లు వేసుకుంటూ బాగా నిద్ర పోయానని తెలిపింది. దీంతో ఒక్క రోజులోనే వైరస్ నుంచి కోలుకున్నానని చెప్పింది. ఇదంతా చైనా సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం వీబో లో వెల్లడించడంతో చైనా నెటిజన్లు ఆమెపై మండిపడ్డారు. ఓవైపు దేశం మొత్తం వైరస్ కారణంగా అల్లాడుతుంటే ఇదేం మూర్ఖపు పని? అంటూ విమర్శలు గుప్పించడంతో జేన్ ఆ పోస్టును తొలగించింది. కరోనా సోకడం ఎటూ తప్పనిసరి అని, అదేదో మనం ఖాళీగా ఉన్నపుడు వైరస్ సోకితే ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తలు తీసుకోవచ్చని భావించినట్లు జేన్ వివరణ ఇచ్చింది.

More Telugu News