China: చైనా శ్మశానాల్లో శవాల గుట్టలు.. నిబంధనలు మార్చేసి తాజాగా ఒక్క మరణమూ లేదంటున్న డ్రాగన్​ దేశం

  • చైనాలో వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్
  • జీరో కొవిడ్ నిబంధన ఎత్తివేశాక రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు
  • మరణాలు లెక్కించే నిబంధనలు మార్చిన చైనా
China says no new Covid deaths after changing criteria as crematoriums packed with bodies

చైనాలో కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతోంది. జీరో కొవిడ్ నిబంధన ఎత్తివేశాక వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోయాయి. వచ్చే మూడు నెలల్లో చైనాలో 60 శాతం మందికి పైగా కరోనా బారిన పడతారని అమెరికా అంటు వ్యాధుల నిపుణుడు ఎరిక్ ఫిగెల్ అంచనా వేశారు. అదే సమయంలో కరోనా వల్ల చైనాలో పెద్ద సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. ప్రధాన నగరాల్లోని శ్మశానవాటికలకు రోజుకు వందలాది మృతదేహాలు వస్తున్నాయని పలు వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి.  

అయితే, డ్రాగన్ దేశం మాత్రం మరణాలను దాచే ప్రయత్నం చేస్తోంది. వైరస్ కారణంగా మరణాలను నమోదు చేయడానికి ఉపయోగించే ప్రమాణాలను మార్చిన తర్వాత ఈ నెల 20 న కరోనా వల్ల ఒక్క వ్యక్తి కూడా మరణించలేదని చైనా బుధవారం తెలిపింది. చైనా ప్రభుత్వం ప్రకారం వైరస్ వల్ల కలిగే శ్వాసకోశ వైఫల్యంతో నేరుగా మరణించే వారిని మాత్రమే కరోనా మరణ గణాంకాల కింద లెక్కిస్తారు. అంటే వైరస్ ఇతర ప్రభావాల కారణంగా సంభవించే చాలా మరణాలు ఇకపై కరోనా లెక్కల్లోకి రాబోవు. 

ప్రస్తుతం అనేక దేశాల్లో వైరస్ ఒక కారకంగా లేదా సహకారిగా ఉన్న ఏదైనా మరణాన్ని కొవిడ్ మరణంగా పరిగణించాలని మార్గదర్శకాలు ఉన్నాయి. కానీ, చైనా మాత్రం మార్గదర్శకాలు మార్చి కరోనా మరణాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోంది. కరోనా వల్ల బీజింగ్ లో సోమవారం ఐదుగురు చనిపోయినట్లు వెల్లడించగా.. మార్గనిర్దేశకాలు మార్చిన తర్వాత మంగళవారం ఒక్కరు కూడా మరణించలేదని తెలిపింది. అయితే, ఓవరాల్ గా వైరస్ వల్ల ఇప్పటిదాకా 5,241 మరణాలు సంభవించినట్టు ఆ దేశ జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రకటించింది. మరోవైపు దేశంలో తాజాగా 3,101 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో, ప్రస్తుత కేసుల సంఖ్య 3,86,276కి చేరుకుంది.

More Telugu News