Imran Khan: కొత్త చిక్కుల్లో ఇమ్రాన్ ఖాన్.. మహిళతో అసభ్యంగా మాట్లాడుతున్న ఆడియో క్లిప్ వైరల్!

Purported audio clip featuring Imran Khan in Rounds on Social Media
  • మహిళతో అసభ్యంగా మాట్లాడుతున్నట్టుగా ఉన్న ఆడియో క్లిప్
  • విరుచుకుపడుతున్న జర్నలిస్టులు
  • ఆ మహిళ ఎవరో తనకు తనకు తెలుసన్న మరో జర్నలిస్ట్
  • ఇమ్రాన్‌ను ఏం చేయలేక ప్రత్యర్థి పార్టీలు ఇలా దిగజారుతున్నాయన్న పీటీఐ
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోమారు చిక్కుల్లో పడ్డారు. ఓ మహిళతో అసభ్యంగా మాట్లాడుతున్న ఇమ్రాన్‌ ఖాన్‌దిగా చెబుతున్న ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండు పార్టులుగా ఉన్న ఈ ఆడియో క్లిప్‌ను పాకిస్థాన్ జర్నలిస్టు సయ్యద్ అలీ హైదర్ తన యూట్యూబ్ చానల్‌లో అప్‌లోడ్ చేశారు. ఇమ్రాన్ ఖాన్‌గా చెబుతున్న వ్యక్తి ఓ మహిళతో అసభ్యకరంగా మాట్లాడినట్టుగా అందులో ఉంది. ఈ ఏడాది మొదట్లో అధికారం కోల్పోయినప్పటి నుంచి ఇమ్రాన్ కష్టాలు ఎదుర్కొంటున్నారు.  తాజాగా, వెలుగులోకి వచ్చిన ఆడియో పాకిస్థాన్ ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) నుంచి వచ్చినట్టు కొన్ని పాకిస్థాన్ వార్తా సంస్థలు తెలిపాయి. 

అయితే, ఈ ఆడియోలో నిజమెంత అన్న విషయంలో స్పష్టత లేనప్పటికీ, పాకిస్థాన్ జర్నలిస్టులు మాత్రం ఆ క్లిప్‌లోని గొంతు ఇమ్రాన్ ఖాన్‌దేనని చెబుతున్నారు. ఇమ్రాన్ తన వ్యక్తిగత జీవితంలో ఏం కావాలంటే దానిని నిరభ్యంతరంగా చేసుకోవచ్చని, కాకపోతే మొత్తం ఉమ్మా (ముస్లిం సమాజం)కి తనను తాను రోల్‌మోడల్‌గా చెప్పుకోవడాన్ని మానుకుంటే మంచిదని జర్నలిస్ట్ హమ్జా అజర్ సలామ్ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. లీకైన ఆడియోలోని మహిళ తనకు తెలుసని మరో జర్నలిస్ట్ మన్సూర్ అలీఖాన్ పేర్కొన్నారు. అయితే, ఆమె పేరు చెప్పేందుకు నిరాకరించారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీలా ఇమ్రాన్ తయారయ్యారని మరో జర్నలిస్ట్ నైలా ఇనాయత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

లీకైన ఆడియో, వెల్లువెత్తుతున్న విమర్శలపై ఇమ్రాన్ ఖాన్ పార్టీ తెహ్రీక్-ఐ-ఇన్సాఫ్ (పీటీఐ) స్పందించింది. వైరల్ అవుతున్న ఆడియో క్లిప్‌ను ‘ఫేక్’గా కొట్టి పడేసింది. ఇదంతా ప్రతిపక్ష నాయకుల కుట్రగా అభివర్ణించింది. వారు ఇంతకుమించి మరేమీ చేయలేరని ఎద్దేవా చేసింది.
Imran Khan
Pakistan
Imran Khan Audio
Social Media

More Telugu News