cong: దిగ్విజయ్ ఫోన్ తో వెనక్కి తగ్గిన తెలంగాణ సీనియర్లు.. పార్టీ నేతల్లో అసమ్మతిపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్

Congress Party leadership focuses on Telangana and appoints Digvijaya Singh as Telangana Congress Adviser
  • ఈ రోజు సాయంత్రం జరగాల్సిన మీటింగ్ వాయిదా
  • భట్టి విక్రమార్కకు పార్టీ చీఫ్ ఖర్గే ఫోన్ ?
  • మహేశ్వర్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడిన దిగ్విజయ్
  • ఒకటి రెండు రోజుల్లో హైదరాబాద్ కు రానున్నట్లు వెల్లడి
తెలంగాణ కాంగ్రెస్ లో లుకలుకలపై పార్టీ హైకమాండ్ దృష్టి పెట్టింది. పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతను పార్టీ సీనియర్ లీడర్ దిగ్విజయ్ సింగ్ కు అప్పగించింది. వెంటనే రంగంలోకి దిగిన దిగ్విజయ్ సింగ్.. పార్టీ నేత మహేశ్వర్ రెడ్డికి ఫోన్ చేశారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆరా తీశారు. ఒకటీ రెండు రోజుల్లో తాను హైదరాబాద్ కు వస్తానని, నేతలందరితో కూర్చుని చర్చిస్తానని చెప్పారు. 

ఈ సందర్భంగా అధిష్ఠానం ఆదేశాలను పాటిస్తామని దిగ్విజయ్ కి చెప్పిన మహేశ్వర్ రెడ్డి.. పార్టీ కోసం పనిచేసిన వారికి అవకాశాలు కల్పించాలన్నదే తమ డిమాండ్ అని స్పష్టం చేశారు. మరోవైపు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఫోన్ చేసినట్లు సమాచారం. దీంతో మంగళవారం సాయంత్రం జరగాల్సిన అసమ్మతి నేతల సమావేశం వాయిదా పడింది. 

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ పదవుల నియామకం నాటి నుంచే పార్టీలో అసంతృప్తి నెలకొంది. లీడర్లు సీనియర్లు, జూనియర్లుగా చీలి విమర్శలు చేసుకున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరుపై సీనియర్లలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీ పదవుల్లో తన వర్గం వారికే రేవంత్ రెడ్డి పట్టం కట్టాడని సీనియర్లు ఆరోపిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా ఇటీవల రేవంత్ నిర్వహించిన సమావేశానికి భట్టి, ఉత్తమ్ తదితర సీనియర్ నేతలంతా డుమ్మా కొట్టారు. 

కాగా, సీనియర్ నేతల ఆరోపణలతో సీతక్క సహా పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో తమ పదవులకు రాజీనామా చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు దిగ్విజయ్ కూడా ఫోన్ చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై, పార్టీలో నెలకొన్న సమస్యలపై తాను హైదరాబాద్ కు వచ్చాక కలిసి చర్చిద్దామని దిగ్విజయ్ సింగ్ చెప్పినట్లు తెలుస్తోంది.
cong
Telangana
digvijay sing

More Telugu News