Andhra Pradesh: ప్రైవేట్ పరం కానున్న ఏపీలోని మూడు విమానాశ్రయాలు

  • విజయవాడ, తిరుపతి, రాజమండ్రి ఎయిర్ పోర్టులు ప్రైవేటు పరం
  • దేశ వ్యాప్తంగా 25 ఎయిర్ పోర్టులను లీజుకు ఇవ్వాలని కేంద్రం నిర్ణయం
  • ఇప్పటికే పీపీపీ విధానంలో లీజుకు 8 విమానాశ్రయాలు
3 airports in AP to give for lease

ఏపీలోని మూడు విమానాశ్రయాలు ప్రైవేటు పరం కానున్నాయి. 2022 - 2025 మధ్య కాలంలో నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ కింద దేశంలోని 25 విమానాశ్రయాలను లీజుకు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. వీటిలో ఏపీకి చెందిన విజయవాడ, తిరుపతి, రాజమండ్రి ఎయిర్ పోర్టులు ఉన్నాయి. ఈ విషయాన్ని రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ వెల్లడించారు. ఇప్పటి వరకు దేశంలోని 8 విమానాశ్రయాలను పీపీపీ విధానంలో ఇప్పటికే లీజుకు ఇచ్చినట్టు వెల్లడించారు. 

మరోవైపు విశాఖ భోగాపురం వద్ద నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు 2,203 ఎకరాల భూమి కావాల్సి ఉండగా... ఇప్పటి వరకు 2,160.47 ఎకరాలను సేకరించినట్టు వీకే సింగ్ తెలిపారు. రాజ్యసభలో బీజేపీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఈ విషయాన్ని వెల్లడించారు. 

విమానాశ్రయ నిర్మాణానికి రూ. 2,500 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేసినట్టు చెప్పారు. విమానాశ్రయం తొలి దశ పనులు పూర్తయితే... ప్రతి ఏటా 60 లక్షల మంది ప్రయాణికుల అవసరాలు తీరుతాయని తెలిపారు. ఈ ఏడాది శీతాకాల షెడ్యూల్ ప్రకారం ఏపీలోని మూడు అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి 15 అంతర్జాతీయ విమానాలు రాకపోకలు జరుపుతున్నాయని చెప్పారు.

More Telugu News