Pawan Kalyan: బీజేపీ, టీడీపీలకు అమ్ముడుపోయే ఖర్మ నాకు లేదు: పవన్ కల్యాణ్

  • సత్తెనపల్లిలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర
  • ధూళిపాళ్లలో సభ
  • తాను ఎవరికీ కొమ్ముకాయడంలేదన్న పవన్
  • 2014 కూటమి కొనసాగి ఉంటే వైసీపీ గెలిచేది కాదని వెల్లడి
Pawan Kalyan speech in Dhulipalla

ఉమ్మడి గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ ఇవాళ కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించడం తెలిసిందే. ఈ కార్యక్రమానికి హాజరైన పవన్ కల్యాణ్ రాజకీయ వాగ్బాణాలు సంధించారు. బీజేపీ, టీడీపీలకు అమ్ముడుపోయే ఖర్మ తనకు లేదని స్పష్టం చేశారు. తానేమీ పెన్షన్లు, బీమా సొమ్ము నుంచి కమీషన్లు కొట్టేసే రకం కాదని పేర్కొన్నారు. 

వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు వ్యతిరేక శక్తులను ఏకం చేస్తానని తెలిపారు. ప్రభుత్వ దుశ్చర్యల వల్లే రోడ్లపైకి వచ్చి పోరాడుతున్నానని పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఎవరికో కొమ్ము కాస్తున్నామని వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఇకముందు కూడా ప్రభుత్వ వ్యవస్థలను వైసీపీ వాడుకుంటుందని అన్నారు. ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని జనసేన శ్రేణులకు పవన్ దిశానిర్దేశం చేశారు. 

మరోసారి వైసీపీ ప్రభుత్వం వస్తే రాష్ట్ర భవిష్యత్తు అంధకారమేనని వ్యాఖ్యానించారు. అధికారం చూడని కులాలను అందలం ఎక్కించడమే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. అయితే అధికారం చూసిన కులాలపై తనకేమీ వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు. 

2014లాగా తాము కూటమిలా ఉండుంటే వైసీపీ గెలిచేది కాదని అన్నారు. నలుగురు బీసీలకు మంత్రి పదవులు ఇస్తే బీసీ సాధికారత అవుతుందా? బీసీల నుంచి ఎందరు పారిశ్రామికవేత్తలు వచ్చారు అని ప్రశ్నించారు. బీసీ నాయకుల వల్లే బీసీలు వెనుకబడుతున్నారని, కొందరు కాపు నేతల వల్లే కాపులు వెనుకబడుతున్నారని విమర్శించారు. ఎవరైనా బాగా మాట్లాడితే తన అంత సంస్కారవంతుడు మరెవ్వరూ ఉండరని, కానీ వైసీపీ నేతలు అడ్డదిడ్డంగా మాట్లాడితే తాను కూడా అలాగే బదులిస్తానని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.

More Telugu News