jaipur murder: శ్రద్ధా వాకర్ తరహాలో జైపూర్ లో హత్య.. మేనత్తను చంపి ముక్కలుగా చేసిన యువకుడు

Man Kills Aunt And Body Pieces Thrown Near Highway In Jaipur
  • బకెట్ లో పట్టుకెళ్లి ఊరవతల పడేసి వచ్చినట్లు వెల్లడి
  • అత్త కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు
  • బంధువులతో కలిసి అత్త కోసం వెతుకులాట..
  • సీసీటీవీ ఫుటేజిలతో అసలు నిజం వెలుగులోకి..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసు తరహాలోనే మరో మర్డర్ జరిగింది. రాజస్థాన్ లోని జైపూర్ లో ఓ యువకుడు తన మేనత్తను చంపి, ముక్కలు చేశాడు. ఆపై బకెట్ లో వాటిని తీసుకెళ్లి మారుమూల ప్రాంతంలో పడేశాడు. తర్వాత ఏమీ ఎరగనట్టు అత్తమ్మ కనిపించట్లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

బంధువులు, పోలీసులతో కలిసి అత్త కోసం వెతుకుతున్నట్లు నటించాడు. అయితే, యువకుడు చెప్పే మాటలకు, అతని ప్రవర్తనకు పొంతనలేకపోవడంతో పోలీసులు లోతుగా విచారించారు. దీంతో హత్య విషయం బయటపడింది. జైపూర్ లోని విద్యానగర్ లో అనూజ్ శర్మ తన తండ్రి, చెల్లెలు, మేనత్తతో కలిసి ఉంటున్నాడు. మేనత్త సరోజ్ భర్త ఇటీవలే చనిపోయాడు. 

కరోనా కారణంగా కిందటేడాది సరోజ్ తల్లి కూడా ప్రాణాలు వదిలింది. ఇటీవల చెల్లెలు, తండ్రి కలిసి ఇండోర్ వెళ్లారు. ఈ నెల 11న సరోజ్ తో పాటు అనూజ్ మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో జరుగుతున్న ఓ కార్యక్రమంలో పాల్గొంటానని అనూజ్ చెప్పగా.. ఇప్పుడు ప్రయాణం వద్దని సరోజ్ అడ్డుకుంది. దీంతో ఇద్దరి మధ్యా తీవ్ర వాగ్వాదం జరిగింది.

అనూజ్ కోపం పట్టలేక సుత్తితో సరోజ్ తలపై బలంగా మోదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఆపై శవాన్ని ముక్కలుగా కోసి, బకెట్, సూట్ కేసులో పెట్టి అనూజ్ దూరంగా పడేసి వచ్చాడు. తర్వాత అత్త సరోజ్ కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంటి బయట ఉన్న సీసీటీవీ కెమెరాలకు సంబంధించిన ఫుటేజ్ లను పోలీసులు పరిశీలించగా.. సరోజ్ బయటకు వెళ్లిన దాఖలాలేవీ కనిపించలేదు. 

అనూజ్ మాత్రం ఓ సూట్ కేసు, బకెట్ తో బయటకు వెళ్లడం కనిపించింది. దీంతో పోలీసులు అనూజ్ ను మరింత లోతుగా ప్రశ్నించడంతో.. ఢిల్లీకి వెళ్లొద్దన్నందుకు అత్తను చంపేసినట్లు అనూజ్ ఒప్పుకున్నాడు. అనూజ్ పై కేసు నమోదు చేసి, దర్యాఫ్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
jaipur murder
youth killed aunt
body chopped
carried in bucket
Rajasthan

More Telugu News