Javelin: 9వ తరగతి విద్యార్థి మెడలోంచి దూసుకెళ్లిన జావెలిన్!

Javelin Pierces Students Neck During Sports Meet At Odisha School
  • ఒడిశాలోని బలంగీర్ జిల్లాలో ఘటన
  • ఓ విద్యార్థి విసిరిన జావెలిన్ అదుపుతప్పి మరో విద్యార్థి మెడలోకి
  • ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న బాలుడు
స్కూల్లో జరుగుతున్న వార్షిక క్రీడోత్సవాల్లో ప్రమాదవశాత్తు ఓ జావెలిన్ (ఈటె) 9వ తరగతి విద్యార్థి మెడలోంచి దూసుకెళ్లింది. ఒడిశాలోని బలంగీర్ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాలలో జరిగిందీ ఘటన. తీవ్రంగా గాయపడిన బాధిత బాలుడు సదానంద మెహర్ ప్రస్తుతం ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అగల్‌పూర్ బాయ్స్ హైస్కూల్‌లో ఓ విద్యార్థి జావెలిన్ త్రో ప్రాక్టీస్ చేస్తుండగా అది ప్రమాదవశాత్తు మెహర్ మెడ కుడివైపు నుంచి దూసుకెళ్లి ఎడమవైపునకు వచ్చింది. 

బాధిత బాలుడిని వెంటనే అలాగే బలంగీర్‌లోని భీమా భోయ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆ జావెలిన్‌ను విద్యార్థి మెడ నుంచి సురక్షితంగా బయటకు తీశారు. మెహర్‌కు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. స్కూల్‌లో స్పోర్ట్స్ మీట్ సందర్భంగా ఈ ఘటన జరిగిందని, బాలుడి ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని బలంగీర్ కలెక్టర్ చంచల్ రాణా తెలిపారు. అలాగే, బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా రూ. 30 వేలు అందించాలని అధికారులను ఆదేశించారు. 

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా ఈ ఘటనపై స్పందించారు. బాలుడికి మరింత మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. అందుకు అవసరమైన నిధుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఉపయోగించాలని సూచించారు.
Javelin
Sports Meet
Odisha
Sadananda Meher
Agalpur Boys' Panchayat High School

More Telugu News