macharla: ప్రభుత్వ ప్రోత్సాహంతోనే మాచర్ల ఘటన: సోమిరెడ్డి

tdp leader somireddy fires on ycp governament over macharla issue
  • ఆఫ్రికా దేశాలను తలపించేలా ఏపీలో పరిస్థితి నెలకొందన్న సోమిరెడ్డి 
  • కేంద్ర ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషించడం సరికాదని వ్యాఖ్య
  • ప్రజాస్వామ్యం బతికుందా అన్న అనుమానం కలుగుతోందని కామెంట్  
మాచర్లలో వైసీపీ గూండాలు జీపులెక్కి విధ్వంసం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ ఘటన చూశాక రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికుందా అని అనుమానం కలుగుతోందని అన్నారు. అరాచకశక్తులు వచ్చే ప్రమాదం ఉందని ముందే తెలిసినా పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించారని మండిపడ్డారు. కార్డన్ సెర్చ్ నిర్వహించి ఏం సాధించారని పోలీసులను సోమిరెడ్డి నిలదీశారు. 

జూలకంటి బ్రహ్మానంద రెడ్డి బలమైన నాయకత్వాన్ని జీర్ణించుకోలేకే ఇలాంటి దాడులకు పాల్పడుతోందని వైసీపీ ప్రభుత్వంపై సోమిరెడ్డి ఆరోపణలు గుప్పించారు. మాచర్ల ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. యూపీ, బీహార్ లలో అరాచకశక్తులను అణిచివేసి, అక్కడి ప్రభుత్వాలు ప్రశాంత వాతావరణం నెలకొల్పాయని చెప్పారు. అన్నపూర్ణ లాంటి ఏపీలో మాత్రం ప్రభుత్వమే అరాచకాలను ప్రోత్సహించడం దురదృష్టకరమని సోమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

మహిళలు, పసిబిడ్డలు వంటిళ్లలో దాక్కొని ఏడుస్తున్నా ఆగకుండా విధ్వంసం కొనసాగించారని సోమిరెడ్డి చెప్పారు. ఆఫ్రికా దేశాల్లో కనిపించే ఆటవిక పరిస్థితులను ఆంధ్రప్రదేశ్ లో చూస్తామని అనుకోలేదన్నారు. తెలుగుదేశం పార్టీని అణిచివేయడంతో పాటు కార్యకర్తలను వచ్చే ఎన్నికలకు దూరం చేయడమే ఈ ఘటన వెనకున్న ఉద్దేశమని ఆరోపించారు. శాంతి భద్రతలతో పాటు అనేక అంశాల్లో వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను మూటగట్టుకుందని సోమిరెడ్డి ఆరోపించారు. ఇంత జరుగుతున్నా ప్రేక్షకపాత్ర వహించడం తగదని కేంద్రాన్ని కోరారు. ప్రశాంత వాతావరణంలో పాలన సాగేలా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని సోమిరెడ్డి గుర్తుచేశారు.
macharla
YSRCP
tdp
Somireddy Chandra Mohan Reddy
julakanti

More Telugu News