elephants: తమిళనాడు మంత్రి కొడుకు పెళ్లికి కేరళ నుంచి ఏనుగులు

  • అతిథులను ఆహ్వానించేందుకు తెప్పించిన మంత్రి
  • సీఎం స్టాలిన్ సహా వీవీఐపీలను స్వాగతించిన ఏనుగులు
  • గజపూజ కోసమేనని కేరళ అధికారుల వివరణ
  • సమాచార హక్కు ద్వారా వెలుగులోకి వచ్చిన ఘటన
Elephants transported from Kerala for marriage of TN ministers son

రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా.. అన్నది సామెత. రాజు మాత్రమే కాదు.. తను తల్చుకున్నా దేనికీ కొదవ ఉండదని చెప్పాలనుకున్నారో ఏమో కానీ తమిళనాడు మంత్రి ఒకరు తన కొడుకు పెళ్లి కోసం కేరళ నుంచి ఏనుగులను తెప్పించారు. వివాహ వేడుక ముందు వాటిని నిలబెట్టి వీవీఐపీలకు స్వాగతం చెప్పించారు. అవి స్వాగతం పలికిన వీవీఐపీలలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా ఉండడం విశేషం! గత సెప్టెంబర్ లో జరిగిన ఈ ఘటన తాజాగా బయటపడి, వివాదం చెలరేగింది.

తమిళనాడు మంత్రి పి.మూర్తి గత సెప్టెంబర్ 30న కొడుకు పెళ్లి చేశారు. ఈ వేడుకకు హాజరయ్యే ప్రముఖుల కోసం ఘనంగా ఏర్పాట్లు చేయాలని, ఏనుగులతో స్వాగతం చెప్పించాలని మంత్రి భావించారు. అనుకున్నదే తడవు కేరళలోని కొట్టాయం నుంచి రెండు ఏనుగులను తెప్పించాలని అధికారులను ఆదేశించారు. వివాహ వేడుకలలో ఏనుగులను ఉపయోగించడంపై నిషేధం ఉన్నప్పటికీ మంత్రి ఆదేశాల నేపథ్యంలో అధికారులు రెండు ఏనుగులను తెప్పించి మంత్రి కొడుకు పెళ్లిలో నిలబెట్టారు.

ఆర్టీఐ కార్యకర్త ఒకరు దాఖలు చేసిన పిటిషన్ తో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివాహ వేడుకలలో ఏనుగులను ఎలా ఉపయోగిస్తారంటూ రాష్ట్రంలో దుమారం రేగింది. దీంతో స్పందించిన అధికారులు వివరణ ఇచ్చారు. సదరు ఏనుగులను మధురైలో జరిగిన గజపూజ కోసం తెప్పించామని చెప్పారు. 

అటు కేరళ అధికారులు కూడా స్పందిస్తూ.. సాధు, నారాయణన్ కుట్టి అనే రెండు ఏనుగులను పంపించిన మాట వాస్తవమేనని, అటవీ శాఖ అనుమతులు తీసుకుని మధురైలో జరిగిన గజపూజ కోసం పంపామని చెప్పారు. గజ పూజలో భాగంగానే మంత్రి కొడుకు పెళ్లిలో పాల్గొన్నట్లు ఆ ఏనుగుల మావటీలు తెలిపారు.

More Telugu News