Uttar Pradesh: అద్దెకుండే వ్యక్తి వద్ద కోటి రూపాయలు.. వాటికోసం చంపేసిన ఇంటి యజమాని!

  • ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఘటన
  • భూమిని విక్రయించగా వచ్చిన కోటి రూపాయలు బ్యాంకులో వేసిన బాధితుడు
  • విషయం తెలిసి డబ్బులు కొట్టేసే ప్లాన్‌ వేసిన ఇంటి యజమాని
  • చంపేసి మూడు ముక్కలుగా నరికి వేర్వేరు ప్రాంతాల్లో విసిరేసిన వైనం  
  • బాధితుడి ఏటీఎం కార్డు ద్వారా రూ. 20 లక్షలు డ్రా
Landlord kills PhD scholar chops body into 3 pieces

తన ఇంట్లో అద్దెకుండే వ్యక్తి వద్ద కోటి రూపాయలు ఉన్న విషయం తెలిసిన ఇంటి యజమాని అతడిని చంపేసి మూడు ముక్కలుగా నరికేశాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. స్థానిక మోదీ నగర్‌లోని ఉమేశ్ శర్మ ఇంట్లో అంకిత్ ఖోకర్ అనే వ్యక్తి అద్దెకు ఉంటున్నాడు. లక్నో యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్న అంకిత్‌ తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితం కన్నుమూశారు. దీంతో ఆయన ఒంటరిగా ఉమేశ్ శర్మ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. 

తనకు వారసత్వంగా వచ్చిన భాగ్‌పట్‌లోని భూమిని అంకిత్ ఇటీవల విక్రయించాడు. వచ్చిన కోటి రూపాయలను బ్యాంకులో దాచుకున్నాడు. విషయం తెలిసిన ఇంటి యజమాని ఉమేశ్ ఆ సొమ్ముపై కన్నేశాడు. అక్టోబరు 6న అంకిత్‌ను దారుణంగా హత్య చేశాడు. ఆపై శరీరాన్ని మూడు ముక్కలుగా నరికి వాటిని అల్యూమినియం పేపర్‌లో ప్యాక్ చేశాడు. ఒకదానిని తీసుకెళ్లి ముజఫర్ నగర్‌లోని ఖటౌలీ వద్ద కాలువలో, మరో భాగాన్ని ముసోరి కాలువలో, మూడో దానిని ఓ రహదారి పక్కన పొదల్లోకి విసిరేశాడు.

మరోవైపు, కొన్ని నెలలుగా ఫోన్ చేస్తున్నా స్పందించకపోవడంతో అంకిత్ స్నేహితులకు అనుమానం వచ్చింది. ఆ తర్వాత కొన్నిసార్లు అంకిత్ ఫోన్ నుంచి మెసేజ్‌లు వచ్చినా అవి తేడాగా ఉండడంతో వారి అనుమానం బలపడింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఉమేశ్ శర్మను అదుపులోకి తీసుకుని విచారించడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. 

అంకిత్‌ను హత్య చేసిన తర్వాత అతడి ఏటీఎం కార్డు ద్వారా పలు దఫాలుగా ఉమేశ్ రూ. 20 లక్షలు డ్రా చేశాడు. ఆ తర్వాత ఆ డెబిట్ కార్డును తన స్నేహితుడైన పర్వేశ్‌కు ఇచ్చి ఉత్తరాఖండ్ పంపాడు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు అంకిత్ మొబైల్ ఫోన్‌ను కూడా అతడికి ఇచ్చినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తాజాగా ఉమేశ్, పర్వేశ్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

More Telugu News