Nirav Modi: వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి లండన్ హైకోర్టులో ఎదురుదెబ్బ

  • పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్ల టోకరా
  • దేశం విడిచి పారిపోయిన నీరవ్ మోదీ
  • భారత్ కు అప్పగింతపై బ్రిటన్ కోర్టు ఆదేశాలు
  • సుప్రీంకోర్టులో సవాల్ చేయాలనుకున్న నీరవ్
  • ఆ అవకాశం లేదన్న లండన్ హైకోర్టు
Nirav Modi gets huge setback in London High Court

భారీ ఆర్థిక నేరాలకు పాల్పడి దేశం విడిచి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి లండన్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తనను భారత్ కు అప్పగించడంపై సుప్రీంకోర్టులో సవాల్ చేసే అవకాశం కల్పించాలని నీరవ్ మోదీ లండన్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, నీరవ్ మోదీ పిటిషన్ ను జస్టిస్ జెరెమీ స్టూవర్ట్ స్మిత్, జస్టిస్ రాబర్ట్ జే ధర్మాసనం తోసిపుచ్చింది. 

తన మానసిక స్థితి సరిగా లేదని, తనను భారత్ కు అప్పగిస్తే ఆందోళనకు గురై ఆత్మహత్య చేసుకుంటానేమోనని నీరవ్ మోదీ పేర్కొనగా... 'నిజమే కావొచ్చు... కానీ మీలాంటి వాళ్లను ఎలా చూసుకోవాలో జైలు అధికారులకు బాగా తెలుసు' అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఈ పిటిషన్ వేసినందుకు గాను మోదీ న్యాయపరమైన ఖర్చుల కింద రూ.1.5 కోట్లు చెల్లించాలని కూడా ఆదేశించారు. 

కాగా, లండన్ హైకోర్టు తాజా తీర్పుతో నీరవ్ మోదీకి అన్నిదారులు మూసుకుపోయినట్టే. ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం నేటితో ఆవిరి కాగా, తనని బ్రిటన్ ప్రభుత్వం భారత్ కు అప్పగించడం లాంఛనమే కానుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు దాదాపు రూ.11 వేల కోట్లకు టోకరా వేసినట్టు నీరవ్ మోదీ ఆరోపణలు ఎదుర్కొంటుండడం తెలిసిందే.

More Telugu News