Bandi Sanjay: అక్కడి సీఎం ఇక్కడి సీఎం కలిసి నాటకాలు ఆడుతున్నారు: బండి సంజయ్

  • ముగిసిన బండి సంజయ్ పాదయాత్ర
  • కరీంనగర్ లో సభ.. హాజరైన జేపీ నడ్డా
  • ధర్మం కోసమే బీజేపీ పోరాటం అన్న సంజయ్
  • కేసీఆర్, జగన్ ఇద్దరూ ఒక్కటేనని కామెంట్ 
  • దోచుకో, దాచుకో సిద్ధాంతంతో పాలిస్తున్నారని విమర్శలు
Bandi Sanjay speech at Karimnagar Rally

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర ఐదో విడత నేటితో ముగిసింది. కరీంనగర్ లో ముగింపు సభ ఏర్పాటు చేయగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విచ్చేశారు. ఈ సభలో బండి సంజయ్ మాట్లాడుతూ, కరీంనగర్ గడ్డ బీజేపీ అడ్డా అని స్పష్టం చేశారు. కరీంనగర్ గడ్డ గర్జిస్తే కొందరికి వెన్నులో వణుకుపుట్టాలని అన్నారు. 

ప్రజల కోసం, ధర్మం కోసమే బీజేపీ పోరాటం అని పేర్కొన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని వివరించారు. తెలంగాణలో అవినీతి, కుటుంబ పాలనను అంతమొందిస్తామని, తెలంగాణను కాషాయపు జెండాతో పవిత్రం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ స్ఫూర్తితో గడీల పాలనపై పోరాడుదామని బండి సంజయ్ పిలుపునిచ్చారు. 

బీఆర్ఎస్ పేరుతో తెలంగాణను తీసేశారని, బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అని ఎద్దేవా చేశారు. 

ఇకఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇద్దరూ ఒక్కటేనని అన్నారు. దోచుకో, దాచుకో అనే సిద్ధాంతంతో పరిపాలన చేస్తున్నారని విమర్శించారు. ఇద్దరూ కలిసి బిర్యానీలు, కాళ్ల కూర, బ్రెయిన్ కూర, చేపల పులుసు, రొయ్యల పులుసు, చికెన్, మటన్ కర్రీలు తిన్నారని వెల్లడించారు. ఇద్దరు సీఎంలు కలిసి నాటకాలు ఆడుతున్నారని, తెలంగాణ సెంటిమెంట్ ను ఉపయోగించుకుని రాజకీయ లబ్ది పొందాలనుకుంటున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. నిన్ను ప్రజలు తిరస్కరిస్తే నువ్వు జై ఆంధ్రా అనాలి... నన్ను ప్రజలు తిరస్కరిస్తే నేను జై తెలంగాణ అంటాను అంటూ ఒప్పందం కుదుర్చుకున్నారని పేర్కొన్నారు.  ఎవరెన్ని కుట్రలు చేసినా బీజేపీని ఏం చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. 

కేసీఆర్ తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చేశారని, కమీషన్ల కోసమే కేసీఆర్ పనిచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో దళితబంధు, రైతు బంధు ఇవ్వడంలేదని... ధరణి పోర్టల్ తో భూములు దోచుకుంటున్నారని బండి సంజయ్ విమర్శించారు.

More Telugu News