Tollywood: అవతార్ 2 సినిమాకు తెలుగు మాటలు రాసింది ఎవరంటే!

Avasarala srinivas pens Telugu dialogues for AVATAR 2
  • తెలుగు మాటలు రాసిన అవసరాల శ్రీనివాస్
  • హాలీవుడ్ సినిమాలపై శ్రీనివాస్ కు మంచి పట్టు
  • ఈ నెల 16న విడుదల కానున్న అవతార్ 2
హాలీవుడ్ దిగ్గజం జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ‘అవతార్’ ఓ ట్రెండ్ సెట్టర్‌‌ గా నిలిచింది. 13 ఏళ్ల క్రితం వచ్చిన ఈ విజువల్ వండర్ చిత్రం ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కి అన్ని భాషల్లోనూ కలెక్షన్ల వర్షం కురిపించిందీ సినిమా. దీనికి కొనసాగింపు‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఇన్నేళ్లకు ‘అవతార్ 2’ రాబోతోంది. ‘ద వే ఆఫ్ వాటర్’ పేరుతో డిసెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇంగ్లిష్ తో పాటు పలు భారతీయ భాషల్లో ప్రేక్షకులను అలరించనుంది. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతోంది. ప్రాంతీయ భాషల్లో డబ్బింగ్ విషయంలో చిత్ర బృందం ప్రత్యేక శ్రద్ధ వహించింది. 

సాధారణ సినిమాల మాదిరిగా కాకుండా ఆయా భాషల్లోనూ ప్రేక్షకులను ఆకట్టుకునేలా డైలాగ్స్ ఉండేలా చేసిందని తెలుస్తోంది. ఈ క్రమంలో  తెలుగు వెర్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు అవసరాల శ్రీనివాస్‌తో మాటలు రాయించారు. శ్రీనివాస్ రచనా శైలి వైవిధ్యంగా ఉంటుంది. తాను దర్శకత్వం వహించిన పలు చిత్రాల్లో ఆయన రాసిన డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఆయనకు హాలీవుడ్ సినిమాలపై మంచి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో ‘అవతార్ 2’కి డైలాగ్స్ రాసే అవకాశం ఆయనకు వచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకొని తనదైన శైలిలో ఈ హాలీవుడ్ చిత్రానికి తెలుగులో మాటలు రాశారని తెలుస్తోంది. అవసరాల శ్రీనివాస్ ప్రస్తుతం నాగశౌర్య హీరోగా ‘ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి’ సినిమా రూపొందిస్తున్నారు.
Tollywood
Avasarala srinivas
dialogues
TELUGU

More Telugu News