Malaysia Airlines: మలేసియా ఎయిర్‌లైన్స్ విమానాన్ని పైలెట్లే కూల్చేశారా?.. తెరపైకి కొత్త వాదన!

  • 8 మార్చి 2014లో బీజింగ్ వెళ్తూ మాయమైన విమానం
  • 2017లో మడగాస్కర్ తీరానికి కొట్టుకొచ్చిన విమాన చక్రాల భాగానికి సంబంధించిన తలుపు
  • ఐదేళ్లుగా బట్టలు ఉతికేందుకు ఉపయోగించుకుంటున్న జాలరి భార్య
  • దానిపై పగుళ్లను బట్టి కుట్రకోణం దాగి ఉందని నిర్ధారణ
  • విమానాన్ని వీలైనంత త్వరగా జలసమాధి చేయాలన్న కుట్ర దాగి ఉందని విశ్లేషణ
Was MH370 Deliberately Downed By Pilot

ఎనిమిది సంవత్సరాల క్రితం 8 మార్చి 2014లో కౌలాలంపూర్ నుంచి బీజింగ్ వెళ్తున్న మలేసియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఒక్కసారిగా అదృశ్యమైంది. ఆ సమయంలో అది మలేసియాలోని పెనాంగ్ దీవికి వాయవ్య దిశలో హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణిస్తోంది. విమానం అదృశ్యమైన సమయంలో అందులో సిబ్బంది, ప్రయాణికులు కలిపి 239 మంది ఉన్నారు. ఆ తర్వాత విమానం కోసం నెలల తరబడి గాలించినప్పటికీ దాని జాడ తెలియరాలేదు. దీంతో అందులోని వారందరూ మరణించినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.

విమానం అదృశ్య ఘటనకు సంబంధించి తాజాగా సరికొత్త వాదన తెరపైకి వచ్చింది. పైలట్లే ఉద్దేశపూర్వకంగా విమానాన్ని కూల్చేసి ఉంటారని భావిస్తున్నారు. తుపాను ధాటికి 2017లో మడగాస్కర్ తీరానికి బోయింగ్ 777 విమాన చక్రాల భాగానికి సంబంధించిన తలుపు కొట్టుకొచ్చింది. అది ఓ మత్స్యకారుడికి దొరికింది. ఆ తలుపును ఇంటికి తీసుకెళ్లగా, అతడి భార్య దానిని బట్టలు ఉతికేందుకు ఉపయోగించేది. ఈ క్రమంలో 25 రోజుల క్రితం అది అధికారుల దృష్టిలో పడింది. దీనిని బ్రిటన్‌కు చెందిన ఇంజినీరు రిచర్డ్ గాడ్‌ఫ్రే, అమెరికాకు చెందిన విమాన శకలాల అన్వేషకుడు బ్లెయిన్ గిబ్సన్‌లు ఆ భాగాన్ని విశ్లేషించారు.

దానిపై సమాంతరంగా నాలుగు పగుళ్లు ఉండడాన్ని గుర్తించిన వారు.. సముద్ర జలాలను బలంగా తాకినప్పుడు విమానానికి సంబంధించిన ఇంజిన్ విచ్ఛిన్నమై ఉంటుందని, అందులో భాగంగానే డోర్‌పై పగుళ్లు ఏర్పడి ఉంటాయని విశ్లేషించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సముద్ర జలాలను వేగంగా ఢీకొట్టడం ద్వారా విమానం విచ్ఛిన్నమయ్యేలా చేశారని, చక్రాల భాగం విచ్చుకునేలా చేసి విమానాన్ని సాధ్యమైనంత త్వరగా జలసమాధి చేయాలని భావించారని విశ్లేషించారు. ఇవన్నీ చూస్తుంటే కూల్చివేత ఆధారాలను దాచేయాలన్న ఉద్దేశం పైలట్లలో కనబడుతోందని వారు వివరించారు. 

నిజానికి అత్యవసర సమయాల్లో విమానాన్ని నీటిపై ల్యాండ్ చేయాల్సి వచ్చినప్పుడు చక్రాల ద్వారాలను తెరవరు. వాటిని తెరిస్తే కనుక నీరు లోపలికి చేరి విమానం త్వరగా మునిగిపోతుంది. ఫలితంగా ప్రయాణికులు తప్పించుకునే సమయం కూడా ఉండదు. కాబట్టి ఆధారాలను పరిశీలించిన తర్వాత విమానాన్ని విఛ్చిన్నం చేయాలని కుట్రదారులు భావించినట్టుగా ఉందని వారు వివరించారు.

More Telugu News