Payyavula Keshav: చంద్రబాబుకు క్షమాపణ చెప్పేంత పెద్ద మనసు జగన్ కు లేదు కాబట్టి ప్రజలకు క్షమాపణ చెప్పాలి: పయ్యావుల

Payyavula Keshav take a swipe at CM Jagan
  • విద్యుత్ కొనుగోళ్ల అంశంపై పయ్యావుల ప్రెస్ మీట్
  • జగన్ ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతోందన్న పయ్యావుల
  • చంద్రబాబుపై విచారణతో అభాసుపాలయ్యారని వెల్లడి
ముఖ్యమంత్రిగా చేసిన తొలి ప్రసంగంలోనే టీడీపీ ప్రభుత్వంలో విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల్లో భారీ అవినీతి జరిగిందని జగన్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం నిజానిజాలు నిగ్గు తేలుస్తుందని చెప్పి, నాలుగేళ్లుగా అబద్ధాలతో ప్రజల్ని నమ్మిస్తున్నాడని, విద్యుత్ ఛార్జీల భారంతో వారిని కుంగదీస్తున్నాడని మండిపడ్డారు. 

పయ్యావుల జూమ్ ద్వారా మాట్లాడుతూ... జగన్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్ల టెండర్ల విషయంలో, తన అనుకున్నవాళ్లకు మేలుచేస్తూ, ప్రజలపై భారం మోపుతోందని విమర్శించారు. 

"చంద్రబాబు  హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి జరిగిందా? అనేదానిపై తేల్చడానికి జగన్ రెడ్డి ప్రభుత్వం విచారణ కమిటీలు వేశారు. ఆఖరికి ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ తలుపుకూడా తట్టి, చివరకు అభాసుపాలయ్యారు" అని వివరించారు. "చంద్రబాబు హయాంలో విద్యుత్ రంగ ఒప్పందాల్లో  సూదిమొనంత అవినీతి కూడా లేదని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు వాదనతో వైసీపీ ప్రభుత్వం కూడా అంగీకరించింది. అంగీకరించడమేకాక, టీడీపీ ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి ప్రభుత్వవాటాగా నిధులు విడుదల కూడా ప్రారంభించింది. 

తనవాళ్లకు కట్టబెట్టడానికే జగన్ రెడ్డి, చంద్రబాబు ప్రభుత్వంలోని టెండర్లన్నీ రద్దుచేశాడు. సోలార్ విద్యుత్ పై పెద్దఎత్తున దుష్ప్రచారంచేసి, మరలాటెండర్లు పిలిచిన జగన్ సర్కారు అయినవారికి కట్టబెట్టాలని చూసింది. ఆ క్రమంలోనే అదానీ సంస్థకు  కట్టబెట్టాలనిచూస్తే, దేశవ్యాప్తంగా పేరు ప్రతిష్ఠలున్న టాటా సంస్థ జగన్ సర్కారు నిర్ణయంపై కోర్టును ఆశ్రయించింది. అదానీ గ్రూపునకు ఏకపక్షంగా టెండర్లు కట్టబెట్టడం తప్పనిచెప్పిన న్యాయస్థానం చివరకు ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దుచేసింది. 

పవన విద్యుత్ కి సంబంధించి చంద్రబాబుగారి హయాంలో పంప్ డ్ స్టోరేజ్ విధానం అనే ప్రయోగాత్మక ప్రక్రియకు శ్రీకారంచుట్టారు. చంద్రబాబు గారి పంప్ డ్ స్టోరేజ్ నిర్ణయం సరైనదని భావించిన జగన్ రెడ్డి, ఆ విధానాన్ని సమర్థిస్తూ, దానివల్ల లాభాలున్నాయని భావించి, తమకు నచ్చిన సంస్థలైన అరబిందో, గ్రీన్ కో లాంటి వాటికి రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించిన ఆస్తుల్ని కట్టబెట్టే ప్రయత్నంచేశాడు.  

ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తప్పు తెలుసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబుగారికి క్షమాపణ చెప్పేంత పెద్దమనసు ఆయనకు ఎలాగూలేదు కాబట్టి, ప్రజలకు చెప్పమంటున్నాం. 

ఇక, అవినీతి బయటపడుతుందనే జగన్ ప్రభుత్వం పీఏసీ కార్యకలాపాలు జరపడంలేదు. విద్యుత్ రంగానికి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రశ్నిస్తూ, పీఏసీ ఛైర్మన్ గా గతంలో తాను విద్యుత్ శాఖ కార్యదర్శికి 11 లేఖలు రాస్తే సమాధానమే లేదు.  నాకున్న వ్యక్తిగత సంబంధాలతోనే సమాచారం సేకరించి, ప్రజలముందు ఉంచుతున్నాను. పీఏసీ యాక్టివ్ గా ఉంటే ప్రజలకు ఎంతమేలు జరుగుతుందో, ప్రభుత్వానికి కూడా అంతే మేలు జరుగుతుంది” అని పయ్యావుల పేర్కొన్నారు.
Payyavula Keshav
Chandrababu
Jagan
PPA
Electricity
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News