Amararaja: చిత్తూరు జిల్లాలో కొత్త ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్న అమరరాజా గ్రూపు

Amararaja setting up new plant in Chittoor District
  • రూ. 250 కోట్లతో ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్న అమరరాజా గ్రూప్ సంస్థ మంగళ్ ఇండస్ట్రీస్
  • కంపెనీ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు కట్టుబడి ఉన్నామన్న గల్లా జయదేవ్
  • ప్లాంట్ల విస్తరణ ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వెల్లడి
చిత్తూరు జిల్లా తేనిపల్లి వద్ద అమరరాజా గ్రూపు కొత్త తయారీ యూనిట్ ను ప్రారంభించబోతోంది. అమరరాజా గ్రూపుకు చెందిన మంగళ్ ఇండస్ట్రీస్ రూ. 250 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ ను ఏర్పాటు చేయబోతోంది. మొత్తం 2.15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్లాంట్ ను నిర్మించనుంది. బ్యాటరీ కాంపొనెంట్స్, టూల్ వర్క్స్, మెటల్ ఫ్యాబ్రికేషన్, ఆటో కాంపొనెంట్స్ తదితర విభాగాల్లో మంగళ్ ఇండస్ట్రీస్ కు మంచి పేరుంది. 

ఈ ప్లాంట్ ద్వారా తయారు చేసే ఆటో విడిభాగాలు, బ్యాటరీ విడిభాగాలు, మెటల్ ఫ్యాబ్రికేషన్ ఉత్పత్తులను దేశంలోని ప్రముఖ కంపెనీలకు సరఫరా చేయనుంది. మంగళ్ ఇండస్ట్రీస్ కు అశోక్ లేలాండ్, బాష్, ఏబీబీ, ఆల్స్టామ్, ఫాక్స్ కాన్ తదితర ప్రముఖ కంపెనీలు కస్టమర్లుగా ఉన్నాయి. 

ఈ సందర్భంగా అమరరాజా సంస్థ అధినేత, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతూ... ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. ప్లాంట్లను విస్తరించడం ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తామని తెలిపారు. తేనిపల్లిలో ఏర్పాటు చేస్తున్న ప్లాంట్ ద్వారా ఈ ప్రాంతంలో అదనంగా మరో వెయ్యి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.
Amararaja
Chittoor District
New Plant
Galla Jayadev
Telugudesam

More Telugu News