Nara Lokesh: పోలీసు ఉద్యోగాల భర్తీకి గరిష్ఠ వయోపరిమితి ఐదేళ్లు సడలించాలి: నారా లోకేశ్

Nara Lokesh wrote AP Police Recruitment Board on age limit
  • ఇటీవల ఏపీలో పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్
  • గరిష్ఠ వయోపరిమితిపై స్పందించిన లోకేశ్
  • ఎంతోమంది అనర్హులవుతున్నారని వెల్లడి
  • పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డుకు లేఖ
ఎట్టకేలకు వైసీపీ సర్కారు పోలీస్ ఉద్యోగాలకు జారీ చేసిన నోటిఫికేషన్ వయోపరిమితి నిబంధనతో చాలా మందికి అందని ద్రాక్షలా మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. పోలీసు ఉద్యోగాల భర్తీకి గరిష్ఠ వయోపరిమితి ఐదేళ్లు సడలించాలని, తద్వారా మరింతమంది నిరుద్యోగులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏపీ పోలీస్ నియామకాల బోర్డు చైర్ పర్సన్ కు లేఖ రాశారు. 

టీడీపీ ప్రభుత్వ హయాంలో 2018లో పోలీసు ఉద్యోగాల భర్తీకి చివరి నోటిఫికేషన్ విడుదలైందని తెలిపారు. ప్రతి ఏటా పోలీసు శాఖలో ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి అధికారం చేపట్టిన వైసీపీ సర్కారు, మూడున్నరేళ్ల తర్వాత పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిందని ఆరోపించారు. 

నాలుగేళ్ల విరామం తర్వాత పోలీసు శాఖలో రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ వెలువడడంతో ఉద్యోగార్థులు సంతోషపడ్డారని, అయితే వారి ఆనందం గరిష్ఠ వయో పరిమితి నిబంధనతో ఆవిరైందని లోకేశ్ తెలిపారు. 

"యువత ఏళ్ల తరబడి పోలీసు ఉద్యోగం కోసం శిక్షణ తీసుకుంటున్నారు. వారికి ఈ నోటిఫికేషన్ వేదన కలిగిస్తోంది. వయోపరిమితి నిబంధన వలన ఎంతోమంది అనర్హులుగా మారిపోయారు. వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నరేళ్లలో ఉద్యోగాల భర్తీకి ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో చాలా మంది అభ్యర్థులు వయస్సు దాటిపోయి అనర్హులుగా మారారు. 

మన పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రం పోలీస్ శాఖ ఉద్యోగాలకు 5 సంవత్సరాల గరిష్ఠ వయో పరిమితి సడలింపును ఇచ్చిన విషయం పరిగణనలోకి తీసుకుని ఏపీలో కూడా వయోపరిమితి సడలింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. 

ఏటా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామనే హామీని వైసీపీ సర్కారు విస్మరించడం, నాలుగేళ్లుగా పోలీస్ శాఖ జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం వల్ల చాలా మంది అనర్హులయ్యారు. వయోపరిమితి దాటి అర్హత కోల్పోయిన వారందరకూ ఉద్యోగ పరీక్షలు రాసేందుకు వీలుగా గరిష్ఠ వయోపరిమితిని ఐదేళ్లకు పెంచాల్సిన అవసరం ఉంది" అని నారా లోకేశ్ తన లేఖలో వివరించారు.
Nara Lokesh
Police Jobs
Age Limit
AP Police Recruitment Board
TDP
YS Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News