mumbai riots: 18 ఏళ్ల తర్వాత.. నాటి ముంబై అల్లర్ల కేసు నిందితుడి అరెస్టు

  • 2004లో నిందితుడిపై అరెస్టు వారెంట్
  • టెక్నాలజీ సాయంతో వల పన్ని మలాడ్ లో అరెస్టు
  • మారుపేర్లతో ముంబై చుట్టుపక్కలే నివసించాడన్న పోలీసులు
  • మిగతా ఐదుగురి కోసం వెతుకుతున్నట్లు వెల్లడి
1992 Mumbai riots accused arrested from Malad after18 year

ముంబై అల్లర్ల కేసులో తప్పించుకు తిరుగుతున్న నిందితుడు ఒకరిని పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో వల పన్ని మలాడ్ లోని ఓ బస్టాప్ లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడితో పాటు పరారీలో ఉన్న మరో ఐదుగురి కోసం ఇంకా గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

1992-93 మధ్యలో ముంబైలో అల్లర్లు చెలరేగి సుమారు 900 మందికి పైగా చనిపోయిన విషయం తెలిసిందే. ఈ అల్లర్లకు సంబంధించి ముంబైలోని పలు పోలీస్ స్టేషన్లలో చాలామందిపై కేసులు నమోదయ్యాయి. ఈ అల్లర్లకు సంబంధించి దిండోషి పోలీస్ స్టేషన్ లో నమోదైన ఓ కేసులో తొమ్మిది మంది నిందితులపై పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. అందులో ఇద్దరిని నిరపరాధులుగా అప్పుడే ప్రకటించగా.. మరొక నిందితుడు చనిపోయాడు. మిగతా ఆరుగురు అప్పటి నుంచి కోర్టుకు హాజరు కాకుండా పరారీలో ఉన్నారు.

2004లో ఆరుగురు నిందితులు పరారీలో ఉన్నట్లుగా కోర్టుకు తెలిపిన పోలీసులు.. వారిపై అరెస్టు వారెంటును తీసుకున్నారు. ఇందులో ఒకరిని తాజాగా మలాడ్ ఏరియాలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఇంతకాలం ముంబై చుట్టుపక్కల ప్రాంతాల్లోనే రకరకాల మారుపేర్లతో నివసిస్తూ ఉన్నాడని పోలీసులు వివరించారు. టెక్నాలజీ సాయంతో వల పన్ని 47 ఏళ్ల నిందితుడిని శుక్రవారం అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. మిగతా ఐదుగురి కోసం గాలింపు కొనసాగిస్తామని వివరించారు.

More Telugu News