Andhra Pradesh: ఏపీలో పొత్తులపై త్వరలోనే ప్రకటిస్తామన్న నాదెండ్ల.. తెలంగాణలోనూ పోటీ చేస్తామన్న శంకర్‌గౌడ్

  • వచ్చే నెల 12న రణస్థలంలో జనసేన ‘యువశక్తి’
  • వాల్‌పోస్టర్ విడుదల చేసిన నాదెండ్ల
  • జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను ప్రభుత్వం మోసం చేసిందని ఆగ్రహం
Janasena Ready to Contest in Telangana

ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులపై త్వరలోనే ప్రకటన చేస్తామని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. వచ్చే నెల 12న శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ‘యువశక్తి’ పేరుతో నిర్వహించనున్న కార్యక్రమ వాల్‌పోస్టర్‌ను నాదెండ్ల నిన్న శ్రీకాకుళంలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.

వైసీపీ విముక్త ఏపీ కోసం అందరూ ఏకం కావాలని పవన్ ఇప్పటికే ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసిన నాదెండ్ల.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారని అన్నారు. దాని ప్రకారం.. వచ్చే ఎన్నికల కోసం ఎలా సిద్ధం కాబోతున్నది త్వరలోనే ప్రకటిస్తామన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత పొత్తుల గురించి అందరికీ తెలియజేస్తామని, ఈ విషయంలో పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తామని తెలిపారు.

అలాగే, రాష్ట్ర ప్రభుత్వంపైనా నాదెండ్ల తీవ్రస్థాయిలో విరుచుకుడ్డారు. యువతకు ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను మభ్యపెట్టిందన్నారు. ఇప్పుడేమో వైసీపీ వ్యవహారాల కోసం కొత్తగా ఐదు లక్షల మంది గృహసారథులను నియమిస్తామని అంటున్నారని, ఇది ప్రజాస్వామ్యబద్ధం కాదని అన్నారు.

మరోవైపు తెలంగాణలోనూ పోటీకి జనసేన సిద్ధమవుతోంది. రాష్ట్రంలో పోటీకి సిద్ధంగా ఉండాలన్న పవన్ పిలుపు మేరకు ఆ పార్టీ నేతలు తలమునకలుగా ఉన్నారు. రాష్ట్రంలో జరగబోయే సాధారణ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ తెలంగాణ ఇన్‌చార్జ్ నేమూరి శంకర్ గౌడ్ తెలిపారు. అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు ప్రారంభించినట్టు పేర్కొన్నారు. కాగా, 32 మందితో కూడిన కార్యనిర్వాహకుల జాబితాను ఆయన నిన్న విడుదల చేశారు.

More Telugu News