K Kavitha: కవితను విచారిస్తున్న సీబీఐ బృందం... లైవ్ లో చూపించాలన్న సీపీఐ నారాయణ

  • ఢిల్లీ లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల కవితపై ఆరోపణలు
  • కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ
  • నేడు కవిత నివాసంలోనే విచారణ
  • కవిత ఏంచెబుతుందో అందరికీ తెలియాలన్న నారాయణ
CPI Narayana demands live telecast of CBI questioning on Kavitha

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. నేడు హైదరాబాదులో కవిత నివాసానికి చేరుకున్న 11 మంది సభ్యుల సీబీఐ బృందం ఆమెను ప్రశ్నిస్తోంది. 

బంజారాహిల్స్ లోని కవిత నివాసంలో న్యాయవాదుల సమక్షంలో విచారణ కొనసాగుతోంది. అమిత్ అరోరా వాంగ్మూలం ఆధారంగా కవితను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేస్తున్నారు. 

కాగా, ఈ వ్యవహారంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని రాజకీయ ప్రత్యర్థులపై కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఎమ్మెల్సీ కవితపై సీబీఐ విచారణను ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందరికీ చూపించాలని అన్నారు.

విచారణలో కవిత సమాధానాన్ని ప్రజలు ప్రత్యక్షంగా వినాలని అభిప్రాయపడ్డారు. లేకపోతే ఎవరికి వారు తమకు అనుకూలమైన స్టేట్ మెంట్లు ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని నారాయణ పేర్కొన్నారు. కోర్టుల్లో వ్యవహారాలనే ఇప్పుడు లైవ్ లో చూపిస్తున్నారని, సీబీఐ విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయడంలో ఇబ్బంది ఏంటి? అని ప్రశ్నించారు.

More Telugu News