NCRB: రెండు తెలుగు రాష్ట్రాల్లో గత మూడేళ్లలో 2,982 మంది రైతుల ఆత్మహత్య: కేంద్రం

  • ఎన్‌సీఆర్‌బీ నివేదికను వెల్లడించిన కేంద్ర వ్యవసాయ మంత్రి
  • రైతుల ఆత్మహత్యల్లో దక్షిణ భారతదేశంలో ఏపీది రెండోస్థానం
  • 2019-21 మధ్య ఏపీ, తెలంగాణలో 2,982 మంది రైతుల ఆత్మహత్య
AP in Second place in Farmers Suicides Says NCRB

ఆంధ్రప్రదేశ్‌లో గత మూడేళ్లలో 1,673 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు కేంద్రం వెల్లడించింది. అదే సమయంలో తెలంగాణలో 1,309 మంది రైతులు మరణించినట్టు తెలిపింది. 2021 జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) ఇచ్చిన నివేదికను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ నిన్న రాజ్యసభలో వెల్లడించారు. 

ఈ గణాంకాల ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి 2019-2021 మధ్య ఏకంగా 2,982 మంది రైతులు ఆత్మహత్యల ద్వారా తనువు చాలించారు. రాజ్యసభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇస్తూ.. రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటని అన్నారు. మిగతా రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు తగ్గుముఖం పడుతుండగా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నట్టు ఎన్‌సీఆర్‌బీ తన నివేదికలో పేర్కొంది. కర్ణాటక, మహారాష్ట్ర తర్వాత అత్యధికంగా ఏపీలోనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపింది. 

2017లో 375 మంది, 2018లో 365 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా, 2019లో 628 మంది, 2020లో 564 మంది, 2021లో 481 మంది రైతులు ఏపీలో ఆత్మహత్య చేసుకుని ఉసురు తీసుకున్నట్టు ఎన్‌సీఆర్‌బీ తెలిపింది. ఏపీతో పోలిస్తే తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టినట్టు నివేదిక పేర్కొంది. 2017లో తెలంగాణలో 846 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా, 2021 నాటికి ఈ సంఖ్య 352కు తగ్గినట్టు వివరించింది.

దక్షిణ భారతదేశంలో కర్ణాటక తప్ప మిగతా రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు క్రమంగా తగ్గుతున్నట్టు కేంద్రం పేర్కొంది. ఇక, దక్షిణ భారతదేశంలో అత్యధికంగా రైతుల ఆత్మహత్యలు నమోదవుతున్న రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉంది.

More Telugu News