UPI: ఒక్కటే బ్లాక్.. ఒకటికి మించిన డెబిట్స్.. యూపీఐలో కొత్త ఫీచర్

  • త్వరలో అందుబాటులోకి రానున్న సదుపాయం
  • క్యాష్ ఆన్ డెలివరీ ఇబ్బందులకు పరిష్కారం
  • ఆన్ లైన్ లో ఏదైనా ఆర్డర్ చేస్తే, డెలివరీ తర్వాతే చెల్లింపులు
UPI single block multiple debit facility coming soon How it will help you

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బీఐ) సింగిల్ బ్లాక్ మల్టిపుల్ డెబిట్స్ అనే ఫీచర్ ను యూపీఐ ప్లాట్ ఫామ్ పై తీసుకురానున్నట్టు తాజాగా ప్రకటించింది. ఒక మర్చంట్ కు సంబంధించి చేయాల్సిన చెల్లింపులను యూపీఐ ద్వారా బ్లాక్ చేసుకోవచ్చు. ఉత్పత్తులు డెలివరీ అయిన తర్వాత అలా బ్లాక్ చేసిన మొత్తం మర్చంట్ కు వెళ్లే ఏర్పాటు ఇది. ఉదాహరణకు ఫ్లిప్ కార్ట్ లో ఒకటి ఆర్డర్ చేశారు. ఆ సమయంలో యూపీఐ బ్లాక్ ఆప్షన్ ఎంపిక చేసుకుంటే చాలు. డెలివరీ అయిన తర్వాతే ఆ చెల్లింపులు జరిగే ఏర్పాటు ఇది.

‘‘ఈ ఫీచర్ వల్ల వినియోగదారులకు కొన్ని ప్రయోజనాలున్నాయి. హోటల్ బుకింగ్ లు, సెకండరీ క్యాపిటల్ మార్కెట్లో సెక్యూరిటీల కొనుగోళ్లు, ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోళ్లు, ఈ కామర్స్ లావాదేవీల విషయంలో ఇది సాయంగా ఉంటుంది’’ అని ఆర్ బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ స్వయంగా వెల్లడించారు. 

ఉదాహరణకు ఓ కంపెనీ షేర్లు కొనాలని అనుకున్నారు. కావాల్సిన మొత్నాన్ని ముందుగా మీ ట్రేడింగ్ అకౌంట్ కు యాడ్ చేసుకుంటేనే, ఆర్డర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు అనుకున్న రేటుకు షేరు కొనుగోలు ఆర్డర్ కన్ ఫర్మ్ కాలేదని అనుకుందాం. అప్పుడు అనవసరంగా ఆ బ్యాలన్స్ ట్రేడింగ్ ఖాతాలో ఉండి పోతుంది. కొత్త విధానంలో ఈ ఇబ్బంది ఉండదు. ఆ మొత్తం బ్యాంకు ఖాతాలో ఉండి, మన కొనుగోళ్ల ధ్రువీకరణ తర్వాతే డెబిట్ అవుతుంది. 

ఈ కామర్స్ విభాగంలో చెల్లింపులు ఈ విధానంతో సులభతరం అవుతాయని నిపుణులు అంటున్నారు. ‘‘మర్చంట్ కు చెల్లింపులు వేగంగా సకాలంలో అయిపోతాయి. కస్టమర్ తన బ్యాంకు ఖాతా నుంచి చెల్లించాల్సిన మొత్తాన్ని యూపీఐ ద్వారా బ్లాక్ చేసినందున.. ఆ చెల్లింపులు కచ్చితంగా జరుగుతాయన్న హామీ ఉంటుంది. దీంతో కస్టమర్ చెల్లించకపోవడం అన్నది ఉండదు. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లో ఉండే ఇబ్బందులు ఈ ఫీచర్ తో తొలగిపోతాయి. డెలివరీ తర్వాత నగదు చెల్లించడం వల్ల, అది సెల్లర్ ను చేరుకోవడానికి సమయం తీసుకుంటుంది. కానీ ఈ బ్లాక్ ఆప్షన్ తో వేగంగా, ఇన్ స్టంట్ గా చెల్లింపులు అయిపోతాయి’’ అని చెబుతున్నారు. ఈ విధానం త్వరలో అమల్లోకి రానుంది.

More Telugu News