Gujarat: గుజరాత్ లో ఈ నెల 11 లేదా 12న బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు

  • గుజరాత్ లో చారిత్రాత్మక విజయం దిశగా బీజేపీ
  • 150కి పైగా నియోజకవర్గాల్లో కమల వికాసమే
  • ఈ నెల 15న ప్రధాని మోదీ గుజరాత్ పర్యటన
  • అంతకుముందే రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు!
Oath taking likely on Dec 11 or 12 says BJP sources

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చారిత్రాత్మక విజయాన్ని అందుకునే దిశగా సాగుతోంది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని ఫలితాలను సాధించబోతోంది. మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 150కి పైగా నియోజకవర్గాల్లో విజయం సాధించనుందని ఫలితాల ట్రెండ్స్ చెబుతున్నాయి.

గతంలో 2002 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 127 స్థానాలను గెలుచుకుంది. ఇప్పటి వరకు ఇదే రికార్డు. తాజా ఎన్నికల్లో ఆ రికార్డు చెరిగిపోతుందని ఎన్నికల విశ్లేషకులు చెబుతున్నారు.

మొత్తం 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో 92 స్థానాల్లో గెలుపొందిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం బీజేపీ 97 స్థానాల్లో విజయకేతనం ఎగరవేసింది. మరో 58 చోట్ల పార్టీ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. కాగా, రాష్ట్రంలో ఈ నెల 11 లేదా 12 కొత్త ప్రభుత్వం కొలువుదీరనుందని సమాచారం.

ఈ రెండు తేదీల్లో ఏదో ఒక రోజు ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం చేస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి. మరోవైపు, ఈ నెల 15న ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. అయినప్పటికీ ప్రధాని పర్యటనకు ముందే ప్రభుత్వం ఏర్పాటవుతుందని బీజేపీ వర్గాలు తెలిపాయి.

More Telugu News