NVSS Prabhakar: గడ్డి కోస్తూ ఉంగరాన్ని పోగొట్టుకున్న మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్... ఇదిగో ఇలా వెదికారు!

  • ఆవుల కోసం గడ్డి కోసిన మాజీ ఎమ్మెల్యే
  • విలువైన నవరత్నాల ఉంగరం జారిపడిన వైనం
  • రాచకొండ సీపీకి సమాచారం
  • నిపుణుల బృందాన్ని పంపించిన రాచకొండ సీపీ
  • కొన్ని నిమిషాల్లోనే ఉంగరం లభ్యం
NVSS Prabhakar lost and found his valuable ring

ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఇవాళ తన వ్యవసాయ క్షేత్రంలో ఉంగరాన్ని పోగొట్టుకున్నారు. ఆయన ఆవుల కోసం పచ్చి గడ్డి కోస్తుండగా ఉంగరం జారిపడింది. ఆ ఉంగరం నవరత్నాలతో కూడిన విలువైన వస్తువు కావడంతో ఆయన రాచకొండ పోలీస్ కమిషనర్ కు సమాచారం అందించారు. 

దీనిపై వెంటనే స్పందించిన రాచకొండ కమిషనరేట్ ఓ ఉన్నతస్థాయి నిపుణుల బృందాన్ని వ్యవసాయ క్షేత్రానికి పంపించింది. వారి వెంట పోలీసు జాగిలాలు కూడా వచ్చాయి. వారి వద్ద ఉన్న సాంకేతిక పరికరాల సాయంతో ఆ వ్యవసాయ క్షేత్రాన్ని జల్లెడపట్టారు. కొన్ని నిమిషాల్లో ఉంగరాన్ని కనుగొన్నారు. దాంతో ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ముఖంలో ఆనందం కనిపించింది. రాచకొండ సీపీకి, వారి టెక్నికల్ టీమ్ కు కృతజ్ఞతలు తెలిపారు.

ఆ ఉంగరం ఎంతో శక్తిమంతమైనదని తాను నమ్ముతానని, స్వామీజీలు పూజ చేసి ఇచ్చిన ఉంగరం అని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వెల్లడించారు. ఆ ఉంగరం దొరకడం సంతోషదాయకమని అన్నారు.

More Telugu News