Maharashtra: ముదిరిన సరిహద్దు వివాదం.. కర్ణాటకకు మహారాష్ట్ర బస్సుల బంద్

 Maharashtra suspends bus services to Karnataka amid security alert
  • బెలగావి సరిహద్దుపై ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు
  • కర్ణాటకలో మహారాష్ట్ర ట్రక్కులపై ఆందోళనకారుల దాడి
  • ప్రతిగా పూణేలో కర్ణాటక బస్సులను ధ్వంసం చేసిన వైనం
మహారాష్ట్ర–కర్ణాటక రాష్ట్రల మధ్య బెలగావి సరిహద్దు వివాదం మరింత ముదిరింది. ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. దాంతో కర్ణాటక రాష్ట్రానికి మ‌హారాష్ట్ర త‌న బ‌స్సు స‌ర్వీసుల‌ను నిలిపివేసింది. బెలగావి సరిహద్దులో మహారాష్ట్ర ట్రక్కులపై ఆందోళనకారులు రాళ్లు విసిరిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణ కార్పొరేషన్ బుధవారం కర్ణాటకకు బస్సు సేవలను నిలిపివేయడంతో, బెలగావి సరిహద్దు వివాదంపై ఇరు రాష్ట్రాల మధ్య విభేదాలు ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. కర్ణాటకలో ఆందోళనల సందర్భంగా బస్సులపై దాడులు జరిగే అవకాశం ఉందన్న భద్రతా హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రయాణికుల భద్రతపై పోలీసుల నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాతే బస్సు సర్వీసులను పునరుద్ధరిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 

సరిహద్దు వివాదం నేపథ్యంలో ఇరు రాష్ట్రాల వాహనాలపై ఆందోళనకారులు దాడులకు తెగబడుతున్నారు. పూణేలోని ప్రైవేట్ బస్సు పార్కింగ్ వద్ద ఆగి ఉన్న కర్ణాటక నంబర్ ప్లేట్‌లతో కూడిన బస్సులపై దాడి చేసిన ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన వర్గానికి చెందిన పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

పూణె నగరంలోని స్వర్గేట్ ప్రాంతంలో శివసేన కార్యకర్తలు ప్రైవేట్ బస్టాండ్‌లోకి చొరబడి కనీసం మూడు కర్ణాటక రాష్ట్ర బస్సులపై నలుపు, నారింజ రంగులను చల్లారు. ఈ బస్సు పార్కింగ్ యజమాని శివసేన (ఉద్ధవ్ క్యాంపు) నగర నాయకుడు కావడం గమనార్హం. అదే రోజు సరిహద్దు జిల్లా బెలగావిలో మహారాష్ట్ర నంబర్ ప్లేట్ ఉన్న లారీపై కన్నడ అనుకూల కార్యకర్తలు చేసిన రాళ్ల దాడికి ప్రతీకారంగా ఈ దాడి జరిగింది.

 కాగా, భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ తర్వాత మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు సమస్య 1957 నాటి నుంచి కొనసాగుతోంది. మునుపటి బొంబాయి ప్రెసిడెన్సీలో భాగమైన బెలగావి సరిహద్దు జిల్లాను మహారాష్ట్ర కోరుతుండగా, సరిహద్దుల ప్రకారం అది తమ రాష్ట్రంలో అంతర్భాగమని కర్ణాటక వాదిస్తోంది.
Maharashtra
Karnataka
belagavi
bus
suspends
boarder
issue

More Telugu News