Andhra Pradesh: ఏపీలో రెండు రోజులు పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. షెడ్యూల్ ఇదే

  • ఈ నెల 4, 5వ తేదీల్లో ఏపీలో రాష్ట్రపతి పర్యటన
  • రాష్ట్రపతి హోదాలో తొలిసారి వస్తున్న ద్రౌపది ముర్ము
  • వైజాగ్ లో నేవీ డే వేడుకలతో పాటు వివిధ కార్యక్రమాల్లో  పాల్గొననున్న రాష్ట్రపతి
President To Tour AP On Dec 4 And 5 To Attend Navy Day Celebrations

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 4, 5వ తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. అందులో విశాఖపట్నంలో జరిగే నేవీ డే వేడుకలు, ఇతర కార్యక్రమాలలో ఆమె పాల్గొంటారు. రాష్ట్రపతిగా బాధ్యతలు అందుకున్న తర్వాత ముర్ము ఏపీకి రానుండటం ఇదే తొలిసారి. షెడ్యూల్ ప్రకారం ఆదివారం ఉదయం 10.15 గంటలకు ప్రత్యేక విమానంలో ఆమె విజయవాడకు వస్తారు. అక్కడి నుంచి రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. విజయవాడ శివార్లలోని పోరంకి గ్రామంలో ఆమె గౌరవార్థం పౌర సత్కార కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆతిథ్యంలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. తరవాత రాష్ట్రపతి విశాఖపట్నం వెళ్తారు. 
 
వైజాగ్‌లోని రామకృష్ణ బీచ్‌లో జరిగే నేవీ డే వేడుకలకు రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అక్కడ భారత నౌకాదళం యొక్క కార్యాచరణ ప్రదర్శనను వీక్షించడంతో పాటు రక్షణ, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖలకు చెందిన వివిధ ప్రాజెక్టులను వర్చువల్ గా ప్రారంభిస్తారు. కర్నూలు జిల్లాలో నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్, కృష్ణా జిల్లా నిమ్మకూరులో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అడ్వాన్స్‌డ్ నైట్ విజన్ ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీని రాష్ట్రపతి ప్రారంభిస్తారు. కర్నూలు, సత్యసాయి జిల్లాల్లో పలు జాతీయ రహదారుల పనులకు ఆమె శంకుస్థాపన చేయనున్నారు.
 
విశాఖపట్నంలోని అనంతగిరిలో జరిగే నేవీ డే రిసెప్షన్‌లో రాష్ట్రపతి పాల్గొని అనంతరం తిరుపతికి బయలుదేరి వెళతారు. సోమవారం తెల్లవారుజామున తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శిస్తారు. అదే రోజు ఉదయం 10.40 గంటలకు తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని సందర్శించి విద్యార్థులు, అధ్యాపకులు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో ముచ్చటించనున్నారు. అనంతరం రాష్ట్రపతి తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు.

More Telugu News