IMD: 8 నుంచి కోస్తా, రాయలసీమల్లో వర్షాలు.. అన్నదాతల్లో ఆందోళన

  • ఈ నెల 5న అల్పపీడనం
  • 7న వాయుగుండంగా మారనున్న వైనం
  • వరి కోతల వేళ రైతుల ఆందోళన
  • ఏపీలో ఫిబ్రవరి వరకు చలి వణికిస్తుందన్న ఐఎండీ
Rains in AP From 8 to 9th Farmers in worry

ఈ నెల 5న దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని, ఇది పశ్చిమ వాయవ్యంగా ప్రయాణించి 7వ తేదీ నాటికి వాయుగుండంగా మారుతుందని వాతావరణశాఖ తెలిపింది. ఆ తర్వాతి రోజున అది పుదుచ్చేరి, తమిళనాడు తీరం దిశగా ప్రయాణిస్తుందని పేర్కొంది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో 8, 9వ తేదీల్లో వర్షాలు పడతాయని తెలిపింది. వాతావరణశాఖ ప్రకటనతో రైతుల్లో ఆందోళన మొదలైంది. 

ప్రస్తుతం గుంటూరు నుంచి శ్రీకాకుళం వరకు జోరుగా వరికోతలు సాగుతున్న నేపథ్యంలో వర్షం కనుక పడితే పంట వర్షార్పణం అయిపోతుంది. దీంతో వర్ష సమాచారం కోసం రైతులు విశాఖలోని తుపాను హెచ్చరిక కేంద్రానికి ఫోన్లు చేసి వాతావరణ పరిస్థితుల గురించి తెలుసుకుంటున్నారు. దీనిపై అధికారులు మాట్లాడుతూ.. 5న అల్పపీడనం ఏర్పడిన తర్వాత కానీ వర్షాలకు సంబంధించిన సమాచారంపై స్పష్టత రాదని పేర్కొన్నారు.  

తూర్పు గాలుల ప్రభావంతో వచ్చే రెండు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. కాగా, మూడు నెలల కాలానికి గాను భారత వాతావరణ శాఖ నిన్న విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. ఏపీలో ఈ నెల నుంచి ఫిబ్రవరి వరకు చలి తీవ్రంగా ఉంటుంది. ఏపీ, తెలంగాణ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతాయి.

More Telugu News