Nakka Anand Babu: పంచాయతీ రాజ్ ఈఎన్ సీగా సుబ్బారెడ్డి నియామకం అతిపెద్ద దళిత ద్రోహం: నక్కా ఆనంద్ బాబు

  • పంచాయతీరాజ్ ఈఎన్ సీగా సీవీ సుబ్బారెడ్డి
  • సీనియారిటీలో ఉన్న బాలు నాయక్ కు అన్యాయం చేశారన్న ఆనంద్ బాబు 
  • ఐదో స్థానంలో ఉన్న సుబ్బారెడ్డికి ఇచ్చారంటూ విమర్శలు  
Nakka Anand Babu fires over CV Subba Reddy appointment as new ENC

ఏపీ పంచాయతీరాజ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్ సీ)గా సీవీ సుబ్బారెడ్డిని నియమించడంపై టీడీపీ సీనియర్ నేత నక్కా ఆనంద్ బాబు తీవ్రస్థాయిలో స్పందించారు. పంచాయతీ రాజ్ ఈఎన్ సీగా సుబ్బారెడ్డి నియామకం జగన్ రెడ్డి చేసిన అతిపెద్ద దళిత ద్రోహం అని మండిపడ్డారు. 

సీనియారిటీ జాబితాలో తొలి స్థానంలో ఉన్న బాలూనాయక్ ని కాదని, 5వ స్థానంలో ఉన్న సీవీ సుబ్బారెడ్డిని జగన్ ఈఎన్ సీగా నియమించడంపై దళితసంఘాలు స్పందించాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఓట్ల కోసం తప్ప, పదవులకు పనికిరారన్న దురభిప్రాయంతో ఉన్న జగన్ కు పంచాయతీరాజ్ శాఖలోని దళితులు బుద్ధిచెప్పాలని తెలిపారు. ముఖ్యమంత్రిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపెట్టాలని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి అయినప్పటినుంచీ రాష్ట్రంలో దళితజాతిపై దాడులు, హత్యలు, అత్యాచారాలు, వేధింపులతో వారిపై కక్షతీర్చుకుంటున్న జగన్ రెడ్డి, ప్రభుత్వశాఖల నియామకాల్లోనూ ఎస్సీ, ఎస్టీలను పూచికపుల్లల్లా తీసిపడేయడం బాధాకరమని నక్కా ఆనంద్ బాబు వ్యాఖ్యానించారు. రెడ్ల సేవలో తరిస్తూ, దళితుల్ని అవమానిస్తున్న ముఖ్యమంత్రికి బుద్ధిచెప్పాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపు నిచ్చారు. 

"సీనియారిటీ ప్రకారం ఎస్సీ,ఎస్టీ అధికారులకు రావాల్సిన పదవుల్ని కూడా జగన్ రెడ్డి రెడ్లకే కట్టబెడుతున్నాడు. పంచాయతీ రాజ్ శాఖలో ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్ సీ) గా నియమించిన సీవీ సుబ్బారెడ్డికి ఉన్న అర్హతలేమిటో ముఖ్యమంత్రి చెప్పాలి. సుబ్బారెడ్డికి ముందు ఈఎన్ సీగా ఉన్న బి.సుబ్బారెడ్డి కూడా సక్రమంగా ఆ బాధ్యతల్లోకి రాలేదు. అప్పుడు కూడా ప్రభుత్వం లోపాయికారీ వ్యవహారంతోనే అతన్ని నియమించింది. తాజాగా జరిగిన ఈఎన్ సీ నియామకంపై పంచాయతీ రాజ్ శాఖలోని ఉద్యోగులు స్పందించాలి" అని నక్కా ఆనంద్ బాబు స్పష్టం చేశారు. 

సీనియారిటీ ప్రకారం ముందున్న బాలునాయక్ ని కాదని, సుబ్బారెడ్డికి ఈఎన్ సీ పదవి ఇవ్వడం ముమ్మాటికీ ఎస్టీఎస్టీ అట్రాసిటీ కిందకే వస్తుందని ఉద్ఘాటించారు. ఈఎన్ సీ నియామకం ముఖ్యమంత్రి స్థాయిలో జరిగిందేనని, ఆయనకు తెలియకుండా జరిగిందని చెప్పి, దళితుల్ని ఏమార్చాలని చూస్తే కుదరదని హెచ్చరించారు. 

"విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్లలో 95 శాతం రెడ్లే ఉన్నారు. డీఎస్పీ ప్రమోషన్లలో 40 శాతం ప్రాధాన్యత రెడ్లకే ఇచ్చారు. జగన్ ప్రభుత్వంలో టీటీడీ ఛైర్మన్ మొదలు, సలహాదారులు, ఇతరత్రా పదవుల్లో 800 మంది రెడ్లున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీలు అడిగినవాటిలో 90 శాతం పనులు చంద్రబాబు పూర్తిచేశారు. జగన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 10 శాతం మేలు చేయకపోయినా, ఆయా వర్గాలు స్పందించలేని దుస్థితిలో ఉన్నాయి. 

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 37 మందికి డీఎస్పీ ప్రమోషన్లు ఇస్తే, 35 మంది చంద్రబాబు సామాజికవర్గం వారే ఉన్నారంటూ, ఢిల్లీ నుంచి గల్లీ వరకు  జగన్ రెడ్డి దుష్ప్రచారం చేశారు. తరువాత అధికారంలోకి వచ్చాక వైసీపీ ప్రభుత్వంలోని హోంమంత్రే అది అబద్ధమని అసెంబ్లీసాక్షిగా ఒప్పుకున్నారు” అని ఆనంద్ బాబు స్పష్టంచేశారు.

More Telugu News