Girl: 15 ఏళ్ల అమ్మాయి పెళ్లికి అనుమతి నిచ్చిన ఝార్ఖండ్ హైకోర్టు

Jharkhand High Court gives nod to 15 years old girl marriage
  • ఓ మైనర్ బాలిక పెళ్లిపై ఝార్ఖండ్ హైకోర్టు కీలక తీర్పు
  • బాలిక ముస్లిం మతస్థురాలు
  • ముస్లిం పర్సనల్ లా బోర్డు సూత్రాలు ప్రస్తావించిన కోర్టు
  • పెద్దల ప్రమేయం అవసరంలేదని వెల్లడి
ఓ మైనర్ బాలిక పెళ్లి విషయంలో ఝార్ఖండ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 15 ఏళ్ల ఆ అమ్మాయి ముస్లిం అయినందున వారి మతాచారాల ప్రకారం పెళ్లి చేసుకునేందుకు అర్హురాలేనని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ బాలిక పెళ్లికి అనుమతి నిచ్చింది. 

ముస్లిం పర్సనల్ లా బోర్డు సూత్రాల ప్రకారం 15 ఏళ్లు, అంతకు పైబడిన వయసు ఉన్న అమ్మాయిలకు పెళ్లి చేసుకునే స్వేచ్ఛ ఉందని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రస్తావించింది. ఇందులో వారి సంరక్షకుల జోక్యంతో పనిలేదని పేర్కొంది.

ఓ ముస్లిం యువకుడు తన మతానికే చెందిన 15 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంటూ దాఖలైన క్వాష్ పిటిషన్ ను ఝార్ఖండ్ హైకోర్టు విచారించింది. ఆ యువకుడి పేరు మహ్మద్ సోను. వయసు 24 సంవత్సరాలు. బీహార్ లోని నవాడా పట్టణ నివాసి. అయితే, ఝార్ఖండ్ లోని జుగ్ సలాయ్ ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలికను మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడని అతడిపై కేసు నమోదైంది. 

బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు మహ్మద్ సోనుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ ను సవాల్ చేస్తూ మహ్మద్ సోను ఝార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించాడు. 

అయితే, విచారణ సందర్భంగా అమ్మాయి తండ్రి మాట మార్చేశాడు. తాను ఈ పెళ్లిని వ్యతిరేకించడంలేదని, తన కుమార్తెకు తగిన వరుడ్ని కుదిర్చినందుకు అల్లాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని కోర్టుకు వెల్లడించాడు. కొంత అవగాహనలేమి కారణంగా సోనుపై ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని వివరించాడు. అమ్మాయి కుటుంబం తరఫు న్యాయవాది కూడా దీనిపై స్పందిస్తూ, ఈ పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించాయని కోర్టుకు విన్నవించారు. 

అనంతరం, న్యాయమూర్తి జస్టిస్ ద్వివేది ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలంటూ పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. ముస్లిం అమ్మాయిల వివాహాలకు సంబంధించిన విషయాలు ముస్లిం పర్సనల్ లా బోర్డుకు సంబంధించిన వ్యవహారం అని తెలిపారు.
Girl
Marriage
Muslim
High Court
Jharkhand
Bihar

More Telugu News