Etela Rajender: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉన్న వారికి శిక్ష తప్పదు: కవితపై ఈటల పరోక్ష వ్యాఖ్యలు

  • ఇక్కడ దోపిడీ సరిపోదన్నట్టు ఢిల్లీలో దందాలు చేశారన్న ఈటల 
  • ధరణి పేరుతో వేల ఎకరాల భూమి మాయం చేశారని ఆరోపణ 
  • ప్రజాక్షేత్రంలో కేసీఆర్ కు శిక్ష తప్పదని వ్యాఖ్య 
Etela comments on KCR and Kavitha

ఇందిరాగాంధీ వంటి నియంతలనే మట్టికరిపించిన దేశం భారతదేశమని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ప్రజల ముందు ఎంతటి వారైనా తక్కువేనని చెప్పారు. భారీ మెజార్టీతో గెలిచిన టీఆర్ఎస్ కు అప్పుడే తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాతలు పెట్టారని... టీఆర్ఎస్ ను కాదని ఇతర పార్టీలకు చెందిన ఏడుగురిని ఎంపీలుగా గెలిపించారని చెప్పారు. ఎంతో చైతన్యం కలిగిన తెలంగాణలో నీ ఆగడాలు, దౌర్జన్యాలు, ప్రజాస్వామ్య వ్యతిరేక పోకడలు పని చేయవని సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి అన్నారు. ప్రజాక్షేత్రంలో నీకు శిక్ష తప్పదని వ్యాఖ్యానించారు.  

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉన్నవారికి కచ్చితంతా శిక్ష పడుతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి ఈటల పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ చేసిన దోపిడీ సరిపోదన్నట్టుగా... ఢిల్లీకి పోయి దందాలు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ధరణి పోర్టల్ పేరుతో వేల ఎకరాల భూమిని మాయం చేశారని... వేల కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించుకుని... ఆ అవినీతి సొమ్ముతో తమలాంటి వాళ్లను ఓడించేందుకు ఖర్చు పెడుతున్న సంగతి నిజం కాదా? అని అడిగారు. 

తెలంగాణ ప్రజానీకాన్ని రెండే రెండు మాటలు అడుగుతున్నానని... 2014 వరకు అటుకులు బుక్కి ఉద్యమాన్ని నడిపామా? ఉపవాసం ఉండి ఉద్యమాన్ని నడిపామా? చెప్పాలని అన్నారు. ఎవరు డబ్బులిచ్చినా తీసుకుని, ఓటు మాత్రం టీఆర్ఎస్ కు వేయాలని ఆనాడు ప్రజలను కేసీఆర్ కోరారని... 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత వేల కోట్లు ఖర్చు పెట్టి ఓట్లను కొనుక్కునే స్థాయికి కేసీఆర్ ఎలా వచ్చారని ప్రశ్నించారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలకు వందల కోట్ల తెలంగాణ ప్రజల సొమ్మును ధారాదత్తం చేస్తున్నది ఎవరో చెప్పాలని అడిగారు. 

టీఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో రూ. 800 కోట్ల వైట్ మనీ ఉందని కేసీఆర్ చెప్పారని... అతి తక్కువ కాలంలోనే ఇంత భారీగా సొమ్ము ఎలా వచ్చిందని ఈటల ప్రశ్నించారు. ఉపవాసం ఉన్న పార్టీకి ఇంత తక్కువ కాలంలోనే వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని అడిగారు. ఎవరూ ఊరికే డబ్బులు ఇవ్వరని... ఈ విషయంపై తెలంగాణ ప్రజలు ఆలోచించాలని సూచించారు.

More Telugu News