ganja: మార్కాపురంలో నగరం నడిబొడ్డున గంజాయి సాగు

Police Busted ganja cultivation in a home garden at markapur prakasam district
  • పెరట్లో గంజాయి మొక్కలు పెంచుతున్న కుటుంబం
  • పోలీసుల దాడిలో వెలుగులోకి.. నిందితుల అరెస్టు
  • కౌన్సెలింగ్ తో గంజాయి సాగును వదిలేసిన ఏజెన్సీ వాసులు
మారుమూల పల్లెలు, కొండలు గుట్టల మధ్య గుట్టుగా జరిగే గంజాయి సాగు ఇప్పుడు నగరంలోకి చేరింది. ఎవరికీ అనుమానం రాకుండా ఇంటి పెరట్లోనే గంజాయి సాగు చేస్తున్న కుటుంబం గుట్టును తాజాగా పోలీసులు రట్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో చోటుచేసుకుందీ ఘటన. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని బాపూజీ కాలనీలో గంజాయి మొక్కలు సాగు చేస్తున్నట్లు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి సమాచారం అందిందని చెప్పారు.

దీంతో సిబ్బందితో కలిసి దాడి చేయగా.. ఇంటి వెనకున్న పెరట్లో మూడు గంజాయి మొక్కలు కనిపించాయని పోలీసులు తెలిపారు. స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో పోలీసులు కూడా అక్కడికి చేరుకుని ఆ మొక్కలను పరిశీలించారు. అవి గంజాయి మొక్కలేనని నిర్ధారించడంతో.. వాటిని సాగు చేస్తున్న దాసరి దానమ్మ, దాసరి పేరయ్యలను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ మొక్కల సాగుకు సంబంధించి ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న కనిగిరి శివ అనే యువకుడు పరారీలో ఉన్నాడని చెప్పారు. ఈ మొక్కల ద్వారా సేకరించిన గంజాయిని కాలేజీ విద్యార్థులు, యువతకు పంపిణీ చేస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

ఏజెన్సీ లో ఉండే జనాలను గంజాయి సాగు నుంచి తప్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఆపరేషన్ పరివర్తన్’ కార్యక్రమం ప్రారంభించింది. పోలీసులు, ఇతర అధికారులు ఏజెన్సీ గ్రామాల్లో పర్యటించి, అక్కడి జనంలో చైతన్యం తీసుకొచ్చారు. చట్టవ్యతిరేకమైన గంజాయి సాగు నుంచి వారిని దూరం చేశారు. ప్రభుత్వం ద్వారా విత్తనాలను సబ్సిడీ కింద అందజేసి ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు ఏజెన్సీ వాసులను ప్రోత్సహించారు.
ganja
markapuram
Andhra Pradesh
ganja cultivation
home garden

More Telugu News